ఓటుకు నోటు కేసుపై సిఎం సమీక్ష!

May 07, 2018


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. ఆ కేసులో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అసలు సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆ కేసుకు సంబంధించి ఫోరిన్సిక్ నివేదిక ఏసిబి చేతికి అందింది. ఆరోజు నామినేటడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ తో “మనవాళ్ళు బ్రీఫ్డ్ మి” అని మాట్లాడిన వ్యక్తి ఏపి సిఎం చంద్రబాబేనని, ఆ గొంతు ఆయనదేనని ఆ నివేదికలో పేర్కొంది. నిజానికి ఆరోజు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ స్టీఫెన్ కు డబ్బు కట్టలు ముట్టజెప్పడం, ఆ సందర్భంగా ఆయనతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడటం అన్నీ స్పష్టమైన ఆధారాలతో రికార్డ్ చేయబడ్డాయి. కనుక ఆ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని ధైర్యంగా చెప్పలేనంత బలమైన సాక్ష్యాధారాలను ఏసిబి సేకరించింది. ఇప్పుడు ఆ ఆధారాలను ఫోరిన్సిక్ విభాగం కూడా దృవీకరించింది. కనుక ఈ కేసు విషయంలో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ లో పోలీస్ అధికారులతో, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. 

ఈ కేసుపై మొదట్లో సిఎం కెసిఆర్ తో సహా తెరాస మంత్రులు, నేతలు చాలా దూకుడుగా వ్యవహరించినా, ఆ తరువాత అందరూ చల్లబడ్డారు. ఆ కేసు ప్రస్తావన చేయడం మానుకొన్నారు. ఆ కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని పద్దతిగా ముగింపు పలికారు. ఆ కేసుకు సంబంధించి వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తెదేపాకే కాదు..సిఎం కెసిఆర్, తెరాస సర్కార్ కు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం త్వరలో చంద్రబాబు నాయుడును కూడా కలుస్తానని సిఎం కెసిఆర్ చెప్పారు. కనుక ఆ కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెపుతారేమో?


Related Post