కెసిఆర్ తెలివికి అది గొప్ప ఉదాహరణ

May 07, 2018


img

రాష్ట్రంలో రైతులందరికీ పంటపెట్టుబడికిగాను ఎకరానికి రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి మొత్తం రూ.8,000 చొప్పున రైతుబంధు పధకం క్రింద ఆర్ధికసహాయం అందించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సామాన్య, నిరుపేద రైతులకు ఎంత ఇచ్చినా అందరూ హర్షిస్తారు. కానీ వారితోపాటు ధనికభూస్వాములకు, భారీ స్థాయిలో వ్యవసాయం చేయిస్తున్న రాజకీయనాయకులకు కూడా అదే లెక్కన ‘ఆర్ధిక సహాయం’ అందించాలనుకోవడాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. అర ఎకరం ఉన్న పేదరైతుకు ఎకరాకు రూ.2,000 మాత్రమే లభిస్తే, రాజకీయాలలో ఉంటూ 70-100 ఎకరాలలో వ్యవసాయం చేయిస్తున్న కోట్లకు పడగలెత్తిన నేతలకు ఒకేసారి అప్పనంగా లక్షల రూపాయలు అందుకోబోతున్నారు. 

ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీలో అందరూ  ఆ సొమ్మును స్వచ్చందంగా వదులుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆవిధంగా వచ్చిన సొమ్మును తెలంగాణా రైతు సమన్వయ సమితి మూలనిధిలో జమా చేస్తామని విజ్ఞప్తి చేశారు. కానీ ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్ రమేష్ బాబు తనకు వచ్చే రూ.1.20 లక్షలను వదులుకొంటున్నట్లు ప్రకటించారు. ఆ సొమ్మును రైతునిధికి విరాళంగా అందజేస్తానని తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం ఇంతగా సహాయపడుతుంటే, ఆర్ధికంగా బలంగా ఉన్న తనవంటి నేతలు, భూస్వాములు పంటపెట్టుబడిని స్వచ్చందంగా వదులుకొని రైతులకు సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. 

మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతుబంధు చెక్కులను రైతులకు అందజేయబోతోంది కనుక బహుశః ఆరోజున మిగిలిన తెరాస నేతలు తాము కూడా స్వచ్చందంగా ఆ సొమ్మును వదులుకొని రైతునిధికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించవచ్చు. తద్వారా వారికి ప్రజలలో మంచిపేరు లభిస్తుంది. వారిపట్ల ప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడితే అది వచ్చే ఎన్నికలలో తెరాసకు మేలు చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అప్పనంగా లభించే కొద్దిపాటి సొమ్ముకు బదులు ప్రజలలో మంచిపేరు, వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటే ఎవరు మాత్రం కాదంటారు. కెసిఆర్ రాజకీయ చతురతకు ఇది చక్కటి నిదర్శనంగా చెప్పవచ్చు.


Related Post