600 ఏళ్ళ తరువాత మొదటిసారిగా పాలమూరులో...

May 07, 2018


img

పాలమూరు అంటే అందరికీ మొదటగుర్తుకు వచ్చేది వలసలే. కానీ తెలంగాణా ఏర్పడి, తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి క్రమంగా మారుతోంది. జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం ఖిల్లా గణపురం. అక్కడ ఎప్పుడో 600 ఏళ్ళ క్రితం కాకతీయులు ఏర్పాటుచేసిన గణపసముద్రం ప్రాజెక్టు ఉంది. నవాబుల కాలంలో దానిని మరింత అభివృద్ధి చేసి 22,000 ఎకరాలకు నీరు అందించేరు. కానీ ఆ తరువాత సమైక్యరాష్ట్ర పాలకులు గణపసముద్రాన్ని పట్టించుకోకపోవడంతో, దానిపైనే ఆధారపడిన రైతులందరూ తమ పొలాలను బీడు పెట్టి వలసలు పోయారు. కానీ తెరాస సర్కార్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఒకటొకటిగా పూర్తవుతూ పంటలకు నీళ్ళు అందుతుండటంతో వలసలు పోయిన రైతులు, రైతు కూలీలు తిరిగివచ్చి పంటలు పండిస్తున్నారు. 

ఈసారి రబీ పంటలకు గణపసముద్రం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చిన రాష్ట్ర సాగునీటిపారుదలశాఖా మంత్రి హరీష్ రావు, దాని కోసం కేవలం 11 నెలల వ్యవధిలోనే కేఎల్ఐ బ్రాంచ్ కెనాల్ పూర్తిచేయించి గణపసముద్రం ప్రాజెక్టుకు 3.5 టిఎంసిల నీళ్ళు పారించారు. మంగనూర్ జీరో పాయింట్ నుంచి గణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా గణపసముద్రంలో నీళ్ళు నింపారు.

సుమారు 600 ఏళ్ళ తరువాత మొట్టమొదటిసారిగా గణపసముద్రం నిండుగా నీళ్ళతో కళకళలాడుతోంది. తమ జీవితంలో మొట్టమొదటిసారిగా నీళ్ళతో కళకళలాడుతున్న ఆ ప్రాజెక్టును చూసి రైతుల మొహాలు కూడా కళకళలాడుతున్నాయి. 

ఈ ఏడాది గణపసముద్రం ప్రాజెక్టు క్రింద రైతులు ఏకంగా 90,000 టన్నులు ధాన్యం పండించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే సీజనులో అధనంగా మరో 3,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. కనుక ఇంకా ఎక్కువ పంటలు పండుతాయి. 

శతాబ్దాలుగా నీళ్ళులేక బీడుపడిన భూములలో ఇప్పుడు పంటలు పండుతున్నాయి. గణపసముద్రంలో నీళ్ళు నిండటంతో చుట్టుపక్కల భూగర్భజలాలు మళ్ళీ పెరిగాయి. ఇప్పుడు విద్యుత్ కోతలు లేవు...పైగా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. కనుక రైతులు బోర్లద్వారా పంటలు సాగుచేస్తున్నారు. ఈనెల 10వ తేదీన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులందరికీ పంట పెట్టుబడిని కూడా అందించబోతోంది. 

తెలంగాణా ఏర్పాటుకు ప్రధానకారణాలలో ఒకటైన ‘నీళ్ళ’ సమస్య ఇంత తక్కువ కాలంలోనే పూర్తిగా తీరిపోతుండటం నిజంగా అందరికీ చాలా సంతోషకరమైన విషయమే. తెలంగాణా రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకొన్నవారికి ఇదే నిజమైన నివాళి అని చెప్పవచ్చు.  



Related Post