ఫెడరల్ ఉచ్చులో చిక్కుకోకండి: కాంగ్రెస్ లేఖలు

May 05, 2018


img

రాష్ట్రంలో తెరాస సర్కార్ పై అవిశ్రాంతంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ తెరాస కూడా ఊహించలేని పనొకటి చేసింది. కెసిఆర్ ఫెడరల్ ఉచ్చులో చిక్కుకోవద్దంటూ మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, దేవగౌడ, అఖిలేష్ యాదవ్ తదితరులను తాము లేఖల ద్వారా హెచ్చరించినట్లు టి-కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చెప్పారు. 

అయన గాంధీ భవన్ లో మీడియాకు ఆ లేఖలు విడుదల చేస్తూ వాటి సారంశం వివరించారు. అయన చెప్పిన పాయింట్లు క్లుప్తంగా..

1. సిఎం కెసిఆర్ తన గురించి తాను గొప్పగా ప్రచారం చేసుకొంటూ, ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ వ్యవస్థను రక్షించేనాధుడు తానేనని అందరినీ నమ్మించేప్రయత్నం చేస్తున్నారు. కానీ నియంతృత్వ పాలన చేస్తున్న ఆయనకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రెంటిపై నమ్మకం లేవనే సంగతి మీరు గ్రహించాలి.  

2. వివిధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అక్రమంగా డబ్బు పోగేసుకొన్న ఆయన, ఇప్పుడు జాతీయస్థాయి నేతగా ఎదగాలని కలలు కంటున్నారు. చవుకబారు రాజకీయాలు చేయడం, మాటలతో అందరినీ మభ్యపెట్టడం, దోపిడీని వ్యవస్థీకృతం చేయడంలో ఆయనకు ఆయనే సాటి.  

3. దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తానని చెపుతున్న కెసిఆర్, భాజపాకు లబ్ది చేకూర్చడం కోసం ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేస్తున్నారు. ఆయన పైకి చెప్పేది ఒకటి..ఆలోచన మరొకటి. తనపై ఉన్న అవినీతి కేసులలో సిబిఐ అధికారులు విచారిస్తున్నారు కనుక ఆ భయంతోనే మోడీ, అమిత్ షాలు ఆడమన్నట్లు ఆడుతూ ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టరు. 

4. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడం కోసమే కెసిఆర్ అకస్మాత్తుగా ఈ ఫెడరల్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దాంతో దేశంలో కాంగ్రెస్ అనుకూల, భాజపా వ్యతిరేకపార్టీల మద్య చీలికలు సృష్టించి భాజపాను గట్టెకించాలనే మోడీ, అమిత్ షాల వ్యూహాన్నే కెసిఆర్ అమలుచేస్తున్నారు.

5. ఇంతకాలం భాజపాతో, మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు, మోడీ ఏపిని మోసం చేశారని ఆరోపిస్తూ వారికి గుడ్ బై చెప్పగా, కెసిఆర్ రూపంలో మోడీ కొత్త మిత్రుడుని సిద్దం చేసుకొంది.

6. మోడీ, అమిత్ షాల డైరెక్షన్ లోనే కెసిఆర్ నడుస్తున్నారనడానికి అనేక ఉదాహరణలున్నాయి. పార్లమెంటులో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడితే తెరాస ఎంపిల చేత వాటిని కెసిఆర్ అడ్డుకొన్నారు. కేంద్ర ఆదాయంలో రాష్ట్రాల వాటాను పెంచాలని కోరుతూ కేరళ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ఆర్దికమంత్రుల సదస్సు నిర్వహిస్తే, కెసిఆర్ దానికి తన ఆర్ధికమంత్రిని పంపించలేదు. నోట్లరద్దు, జి.ఎస్.టి.,ఉపరాష్ట్రపతి ఎన్నిక మొదలైన అంశాలలో కెసిఆర్ మోడీకి గట్టిగా మద్దతు పలికారు. మోడీ మతతత్వ, నిరంకుశపాలనతో విసిగిపోయిన దేశప్రజలందరూ కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్న ఈ సమయంలో కెసిఆర్ భాజపాకు లబ్ది కలిగించేందుకే ఫెడరల్ డ్రామా మొదలుపెట్టడం దురదృష్టకరం.         

7. ఇక ఒక్కో ప్రతిపక్ష నేతను కలిసినప్పుడు కెసిఆర్ ఒక్కో రకంగా మాట్లాడటం గమనిస్తే అయన రాజకీయ ద్వంద వైఖరి అర్ధమవుతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని కలిసినప్పుడు దేశంలో బలమైన ఫెడరల్ వ్యవస్థ అవసరమని అన్నారు. దేవగౌడని కలిసినప్పుడు ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. అదే..తమిళనాడులో స్టాలిన్ లను కలిసినప్పుడు అసలు తను ఏ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించడంలేదని, ధర్డ్ ఫ్రంట్ మీడియా సృష్టి అని బుకాయించారు. ఈవిధంగా తన ఫ్రంట్ గురించి ఒక్కోసారి ఒక్కో మాట చెపుతున్న కెసిఆర్ ను మనం ఏవిధంగా నమ్మగలము? భాజపాను గద్దె దించడానికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నాని కెసిఆర్ చెపితే దానిని స్వాగతిస్తున్నానని, కెసిఆర్ తనకు మంచి స్నేహితుడని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడం గమనిస్తే, కెసిఆర్ వెనుక మోడీ, అమిత్ షాలు ఉన్నారని అర్ధమవుతోంది.

8. దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు గురించి మాట్లాడుతున్న కెసిఆర్ రాష్ట్రంలో నీచరాజకీయాలు చేస్తున్నారు. 2014 ఎన్నికలలో తెరాసకు 63 సీట్లే వచ్చాయి. కానీ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేను నయాన్నో భయన్నో లొంగదీసుకొని తెరాసలోకి ఫిరాయింపజేయడంతో ఇప్పుడు వారి సంఖ్య 82 కు చేరింది. పైగా నేటికీ ఇతర పార్టీలలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారికి కెసిఆర్ మంత్రిపదవులు ఇచ్చారు.    

9. దేశంలో వ్యసాయరంగాన్ని బలోపేతం చేసి రైతన్నలకు మేలు చేస్తానని గొప్పలు చెప్పుకొంటున్న కెసిఆర్ ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఆర్ధికబాధల కారణంగా చనిపోయిన 4,500 మంది రైతుల కుటుంబాలను ఆదుకోలేదు. ఇక విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు, ఫీజ్-రీఇంబర్స్ మెంట్, ఉద్యోగాల భర్తీ వంటి అనేక హామీలను అమలుచేయలేక చేతులు ఎత్తేశారు. మిగిలు రాష్ట్రంగా చేతికి అందిన తెలంగాణా రాష్ట్రానికి ఈ నాలుగేళ్ళలోనే రూ.2 లక్షల అప్పులు చేసిపెట్టారు.    

కనుక మోడీ, అమిత్ షాల రాజకీయ వ్యూహంలో భాగంగా కెసిఆర్ ఏర్పాటు చేయాలనుకొంటున్న ‘ఫెడరల్ ఉచ్చు’లో చిక్కుకోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము,” అని లేఖల ద్వారా హెచ్చరించామని దాసోజు శ్రవణ్ చెప్పారు.


Related Post