వారిద్దరి సభ్యత్వాలు పునరుద్దరిస్తారా లేకపోతే...

May 05, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వం రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పటికి మూడు వారాలు గడుస్తున్నప్పటికీ స్పీకర్ మధుసూధనాచారి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. శనివారం అయన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ, “మా ఇద్దరి ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని తక్షణమే పునరుద్దరించాలని స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేకుంటే ముందుగా మేము గవర్నర్ కు పిర్యాదు చేస్తాము. ఆ తరువాత రాష్ట్రపతికి పిర్యాదు చేస్తాము. అప్పటికీ స్పందించకపోతే దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తాము. కనుక స్పీకర్ తక్షణమే హైకోర్టు తీర్పును గౌరవించి వారిరువురి సభ్యత్వాలను తక్షణమే పునరుద్దరిస్తారని ఆశిస్తున్నాము,” అని అన్నారు. 

కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల గురించి మాట్లాడుతూ, “ప్రజల దృష్టి సమస్యలపై నుంచి మళ్ళించడానికే కెసిఆర్ ఈ సరికొత్త డ్రామా ఆడుతున్నారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేకపోతున్న కెసిఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాననడం, రాష్ట్రంలో నియంతృత్వపాలన చేస్తూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.  రాష్ట్రపతిని కలిసినప్పుడు రాష్ట్రంలో నెలకొన్న అరాచకపరిస్థితుల గురించి వివరిస్తాము. అలాగే కెసిఆర్ నియంతృత్వ పాలన గురించి జాతీయమీడియాకు కూడా వివరిస్తాము,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల విషయంలో హైకోర్టు తీర్పును తెరాస సర్కార్ వ్యతిరేకిస్తోంది కనుకనే తన ఎమ్మెల్యేల చేత దానిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయించింది. దానిపై హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకొంటుందో పక్కనపెడితే, తెరాస ఎమ్మెల్యేల చేత పిటిషన్ వేయించిందంటే ఈ వ్యవహారంలో తెరాస సర్కార్ వెనక్కు తగ్గాలనుకోవడం లేదని స్పష్టం చేసినట్లే భావించవచ్చు. కనుక బంతి ఇప్పటికీ కాంగ్రెస్ కోర్టులోనే ఉంది. దీనిపై వారు ఏవిధంగా ముందుకు వెళ్ళాలో వారి ఇష్టం. స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూడనవసరంలేదు. 


Related Post