వాటితో టి-కాంగ్రెస్ ఏమి సాధిస్తుంది?

May 05, 2018


img

తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఈనెల 13న ఉమ్మడి అదిలాబాద్ నుంచి మళ్ళీ ప్రజాచైతన్య బస్సుయాత్రలు మొదలుపెట్టబోతున్నారు. ఈ బస్సు యాత్రల ప్రదానోదేశ్యం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడం. పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం నింపి వచ్చే ఎన్నికలకు సిద్దం చేయడం. ప్రజా సమస్యలపై తెరాస సర్కార్ ను గట్టిగా నిలదీస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించడం. అయితే కాంగ్రెస్ నేతలనుకొన్న ఈ ప్రయోజనాలన్నీ సాధించగలవో లేదో తెలియదు కానీ ఈ బస్సు యాత్రలతో వారి మద్య నెలకొని ఉన్న అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు బయటపడుతున్నాయి. బహుశః ఈ యాత్రలు పూర్తయ్యే సమయానికి అవి పరాకాష్టకు చేరుకొని, పార్టీలో పెనుమార్పులకు దారి తీసినా ఆశ్చర్యం లేదు. 

ఇక బస్సు యాత్రలలో వారు తెరాస సర్కార్ ను బాగానే ఎండగడుతున్నప్పటికీ, “మీ హయంలో ఈ ప్రాజెక్టులు ఎందుకు చేపట్టలేకపోయారు? చేపట్టినవాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు?” అనే తెరాస నేతల ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సూటిగా సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు. కనుక వారు తమ బస్సు యాత్రలో తెరాస సర్కార్ పై ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా, ఈ ఒక్క కారణం చేత వారిపై తెరాస పైచెయ్యి సాధిస్తోంది. వారి ఆరోపణలకు సమాధానంగా తాము కట్టిన, ఇంకా కడుతున్న పలు ప్రాజెక్టుల గురించి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి తెరాస నేతలు గట్టిగా చెప్పుకోగలగడంతో కాంగ్రెస్ నేతల ఆరోపణలు తేలిపోతున్నాయి. 

కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి రుజువులు, సాక్ష్యాలు కనబడటం లేదు కానీ తెరాస నేతలు చెపుతున్నవన్నీ కళ్ళెదుట ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఉదాహరణకు రైతుబంధు పధకంలో భాగంగా ఎకరాకు రూ.4,000 చెక్కులను మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ప్రభుత్వం చెక్కులు అందించబోతోంది. ఆ కార్యక్రమాన్ని తెరాస సర్కార్ తను ఏర్పాటు చేసిన తెలంగాణా రైతు సమన్వయ సమితి ద్వారా నిర్వహించబోతోంది కనుక ఈ పధకం గురించి తెరాస నేతలు మరింత గట్టిగా చెప్పుకోగలుగుతారు. 

ఇంచుమించు అదే సమయంలో (మే 13న) టి-కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రకు బయలుదేరి తెరాస సర్కార్ పై ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారు? పైగా ఆ సమయంలో రైతులందరి చేతుల్లో ప్రభుత్వం అందించిన చెక్కులుంటాయి కనుక తెరాస సర్కార్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు, ఆరోపణలు చేస్తే, రైతులలో కాంగ్రెస్ పార్టీపట్లే వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని వారు మరిచిపోతున్నారు. అంటే బస్సు యాత్రలతో ఆశించిన ప్రయోజనం లభించకపోగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టమే జరుగుతోందని అర్ధమవుతోంది. రాజకీయాలలో కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలకు ఇంత చిన్న విషయం అర్ధం కాలేదంటే ఆశ్చర్యంగానే ఉంది.


Related Post