ఆయన సమస్యలను పరిష్కరిస్తున్నారా..ఆహ్వానిస్తున్నారా?

May 04, 2018


img

మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్వచ్చందంగా పదవీ విరమణ తీసుకొన్న తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే అయన శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రైతుల సమస్యల పరిష్కారానికి రైతుకమిటీలు ఏర్పాటు చేస్తాను. ఇతర రాష్ట్రాలలో రైతులు అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయవిధానాలను అధ్యయనం చేసి వాటి గురించి మన రైతులకు అవగాహన కల్పిస్తాను. రైతులకు మేలుచేసే వ్యవసాయ విధానాల అమలుకు కృషి చేస్తాను. రెండు నెలలపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన తరువాత నా కార్యాచరణ ప్రకటిస్తాను,” అని లక్ష్మీనారాయణ చెప్పారు. 

అయన తన ఉద్యోగాన్ని వదులుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించడం చాలా గొప్ప విషయమే. కానీ సమస్యల పరిష్కారం కోసం రైతు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలను ఆహ్వానించినట్లవుతుంది. ఎందుకంటే, తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణా రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు అవసరమైన సహాయసహకారం అందించబోతోంది. అలాగే ఏపిలో కూడా సహకార రైతు సంఘాలు వగైరా ఉన్నాయి. ఈ సంఘాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రభావం, కులాల ప్రభావం కూడా చాలా ఎక్కువే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 

కనుక లక్ష్మి నారాయణ మళ్ళీ కొత్తగా రైతు కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే, ఇప్పటికే ఉన్నవాటికి అవి సమాంతర వ్యవస్థగా మారుతాయి. కనుక సహజంగానే ఊహించని కొత్త సమస్యలు, ఘర్షణలు పుట్టుకురావచ్చు. అయన చిత్తశుద్ధితో రైతులకు మేలు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, అయన చర్యలు అధికార పార్టీలకు ఇబ్బందికరంగా మారే అవకాశాలే ఎక్కువ. కనుక అయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి, అది అధికారంలోకి వస్తే, తను కోరుకొన్నట్లుగా వ్యవసాయ శాఖమంత్రి కాగలిగితే తన ఆశయాలను ఆచరణలో పెట్టవచ్చు. లేకుంటే కొత్త సమస్యలు ఆహ్వానించినట్లే అవుతుంది. 


Related Post