జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో రభస

May 03, 2018


img

దేశవ్యాప్తంగా సినీపరిశ్రమలోని వారందరూ జాతీయ సినీ అవార్డుల కార్యక్రమం కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకొనే అవకాశం ఉన్నందునే దానికి అంత ప్రాధాన్యత. ఈసారి మొత్తం 137 మంది జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు అందుకొనేందుకు అందరూ డిల్లీ రావాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖ అవార్డు గ్రహీతలు అందరికీ చాలా రోజుల క్రితమే లేఖల ద్వారా ఆహ్వానించింది. కానీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నందున వారిలో కేవలం 11 మందికి మాత్రమే ఆయన చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారని, మిగిలినవారికి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అందజేస్తారని తెలియజేస్తూ మూడురోజుల క్రితం కేంద్ర సమాచార, ప్రసారశాఖ వారందరికీ లేఖలు వ్రాయడంతో వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకొన్నట్లు జవాబు వ్రాశారు. 

ముందే చెప్పినట్లుగానే గురువారం డిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేవలం 11 మందికి మాత్రమే స్వయంగా అవార్డులు ప్రధానం చేశారు. కనుక ఈ జాతీయ అవార్డులకు ఎంపికైనవారిలో 67 మంది ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా తమ నిరసనను తెలియజేశారు.

‘మేము ఎన్నో ఏళ్ళు సినీ పరిశ్రమలో పనిచేసి మా అనుభవంతో తీసిన ఒక మంచి సినిమాకు కేంద్రప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు మా ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభించిందని చాలా సంతోషించాము. కానీ ఏవో కారణాలతో రాష్ట్రపతి మాకు అవార్డులు ఇవ్వరని చెప్పడం మాకు చాలా బాధ కలిగించింది. మమలని పిలిచి అవమానించినట్లు భావిస్తున్నాము. మేము ఒక గొప్ప సినిమాను నిర్మించాలంటే అనేక ఏళ్ళు పడుతుంది. మాకు అవార్డు అందివ్వడానికి రాష్ట్రపతికి ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ మా కోసం అయన ఒక్క క్షణం సమయం కేటాయించలేరా? ఈ తరుణం కోసం ఇండస్ట్రీలో అందరూ జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కానీ అవార్డుకు ఎంపిక చేసి దానిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వలేమని చెప్పడం మమ్మల్ని అవమానించడంగానే భావిస్తున్నాము. అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకొన్నాము. రాష్ట్రపతి స్వయంగా ఎప్పుడు ఈ అవార్డును ఇస్తారో అప్పుడే మేము తీసుకొంటాము,” అని అన్నారు ఈ అవార్డులకు ఎంపికైన ప్రముఖ నిర్మాత మేఘనాథ్ తదితరులు. 


Related Post