నోట్లు మాయమవడం వెనుక పెద్ద కుట్ర!హవ్వ!

May 03, 2018


img

ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ నగదు కొరత. రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం నోట్ల కష్టాలు తప్పడం లేదు. నోట్ల కష్టాలకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒక కారణం  పంటలు అమ్మగా రైతుల చేతికి వచ్చిన డబ్బును వారు బ్యాంకులలో జమా చేయకుండా తమ వ్యవసాయ అవసరాల కోసం ఇంట్లోనే అట్టేపెట్టుకోవడమని ఎవరో కనిపెట్టి చెప్పారు. ఒక రాజకీయ నాయకుడు లేదా కార్పోరేట్ సంస్థ వద్ద ఉండే సొమ్ముతో పోలిస్తే రైతు వద్ద ఉండే సొమ్ము ఎంత? దానిని బ్యాంకులో జమా చేయకపోవడం వలననే దేశంలో నగదు సంక్షోభం ఏర్పడిందని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందో!

ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ కూడా మరొక కారణం కనిపెట్టారు. మార్కెట్లలో నుంచి రూ.2,000 నోట్లు కనబడకుండా మాయం అయిపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అయన బిజెపికి చెందిన నాయకుడు కనుక తన పార్టీపై, తమ కేంద్రప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి ఈ కారణం కనిపెట్టి ఉండవచ్చు. ఒకవేళ అది నిజమని ఆయన నమ్ముతున్నట్లయితే, అదే ముక్క ప్రధాని నరేంద్ర మోడీ చెవిలో వేస్తే అయన నోట్ల మాయంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించేవారు కదా?

అయితే నోట్లు అదృశ్యానికి రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ తరువాత వరుసగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో వాటి తరువాత సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలంటేనే డబ్బుతో ముడిపడున్న వ్యవహారం. ఒక్క అసెంబ్లీ ఎన్నికలకే వందల కోట్లు మంచినీళ్ళలా ఖర్చు చేయవలసిన రోజులివి. కానీ నగదు లావాదేవీలపై సర్వత్రా నిఘా పెరగడంతో ఇదివరకులాగ ఒకేసారి 20-30 కోట్ల నగదు తీసి ఖర్చు పెట్టడం చాలా కష్టంగా మారింది. దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఈ ఎన్నికలకు కొన్ని వేలకోట్ల నగదు అవసరం ఉంటుంది. కనుక రాజకీయ పార్టీలు, వాటి నేతలు ఏడాది క్రితం నుంచే నగదును పోగు చేయడం మొదలుపెట్టి ఉండవచ్చు. దేశప్రజలు నగదు కొరతతో అల్లాడుతుంటే, కర్ణాటక ఎన్నికలలో గత నాలుగైదు రోజులలోనే రూ.31 కోట్లు పైగా నగదు పట్టుబడింది. అవన్నీ రూ.2,000, రూ.500 నోట్లే. అంటే ఈ వాదన నిజమేనని అర్ధమవుతోంది. 

ఇక డిమాండ్ అండ్ సప్లై అనే పాత తియరీని మరోసారి గుర్తుచేసుకోక తప్పదు. గత ఏడాది దేశంలో ఉప్పు స్టాక్స్ వేగంగా తగ్గిపోతున్నాయని పుకార్లు మొదలవగానే అందరూ బస్తాల కొద్దీ ఉప్పు కొనిపెట్టుకొన్నారు. నగదు విషయంలో కూడా అదే జరుగుతోందని చెప్పవచ్చు. నగదు కొరత పెరగగానే, ప్రజలందరూ అప్రమత్తమయి బ్యాంకుల నుంచి వీలైనంత ఎక్కువ నగదును వెనక్కు తీసుకోవడం, చేతిలో ఉన్న నగదును బ్యాంకులలో వేయకుండా ఇంట్లో దాచుకోవడం వలన బ్యాంకులలో నగదు కొరత ఏర్పడి ఉండవచ్చు. 

ఇక బ్యాంక్ లావాదేవీలపై ఆంక్షలు, కోతలు, జరిమానాలతో సామాన్య ప్రజలకు బ్యాంకులు అంటేనే భయం పుట్టుకొంది. ఒకప్పుడు బ్యాంక్ లో డబ్బులు దాచుకొంటే అది చాలా భద్రంగా ఉంటుందని, వడ్డీ వస్తుందనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అందుకు పూర్తి విరుద్దమైన పరిస్థితులున్న సంగతి అందరికీ తెలిసిందే. డబ్బు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, తీసినా వేసినా జరిమానాలు తప్పవు. బ్యాంకులు ఏదో ఒక పేరుతో మన ఖాతాలో నుంచి డబ్బు కట్ చేసి తీసేసుకొంటూనే ఉంటాయి. కనుక  బ్యాంక్ లో డబ్బు దాచుకొంటే పెరగడం సంగతి దేవుడెరుగు. తగ్గిపోకుండా అదే పదివేలు అనుకొనే పరిస్థితి ఏర్పడింది. 

ఇక విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ వంటి బడాబాబులు బ్యాంకులను నిలువు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వాలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం, ఆ భారాన్ని తమపైకి బదిలీ చేయడాన్ని సామాన్య ప్రజలెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణాల చేత బ్యాంకులపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. అదే మాట ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్, ఐటి మంత్రి కేటిఆర్ చెపుతున్నారు. బ్యాంకులకు నగదు తిరిగి చేరకపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పవచ్చు. 

ఇన్ని లోపాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా, రైతులు నగదు జమా చేయకపోవడం వలననే నగదు కొరత ఏర్పడిందని, ఏదో కుట్ర జరుగుతోందని చెప్పుకోవడం అవివేకమే. ఇటువంటి వాదనలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే పనికివస్తాయేమో కానీ ఈ సమస్యను పరిష్కరించలేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. నగదు కొరత ఏర్పడగానే బారీగా నోట్లు ముద్రించి పంపిణీ చేస్తుంటే చివరికి ఏమవుతుంది? అనే ఆలోచన లేకుండా కధ నడిపిస్తున్నారు పాలకులు.


Related Post