ఫెడరల్ ఫ్రంట్ లో కాంగ్రెస్ కూడా ఉంటుందా?

May 02, 2018


img

ఫెడరల్ ఫ్రంట్ లో కాంగ్రెస్ కూడా ఉంటుందా? చాలా గమ్మతైన ప్రశ్న ఇది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించేందుకు బుధవారం హైదరాబాద్ కు వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను ఒక విలేఖరి అడిగిన ప్రశ్న ఇది. 

కెసిఆర్, అఖిలేష్ యాదవ్ ల సమావేశం ముగిసిన తరువాత వారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక విలేఖరి అఖిలేష్ ను ఈ ప్రశ్న అడిగారు. ఎందుకంటే, ఆయనకు రాహుల్ గాంధీతో మంచి దోస్తీ ఉంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మద్య సత్సంబంధాలున్నాయి. కనుక ఫెడరల్ ఫ్రంట్ కూడా కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేస్తుందా? అనే అనుమానం కలగడం సహజం. 

నిజానికి కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కెసిఆర్ ఆలోచన. కానీ అఖిలేష్ యాదవ్ భాజపాను నిఖచ్చిగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు కానీ కాంగ్రెస్ గురించి అడిగిన ప్రశ్నకు, ‘ఇంకా ఫ్రంట్ ఏర్పాటుకాకముందే దానిలో ఏఏ పార్టీలు ఉంటాయని ఆలోచించడం తొందరపాటే అవుతుందని’ సమాధానం దాటవేశారు. అంటే తాను భాజపాను వ్యతిరేకించినట్లు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించబోనని సంకేతాలు ఇచ్చినట్లయింది. 

ఒకవేళ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో స్నేహం వదులుకోవడానికి ఇష్టపడకపోతే, దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు అవుతున్న ఫెడరల్ ఫ్రంట్ లో సమాజ్‌వాదీ పార్టీ ఏవిధంగా భాగస్వామికాగలదు?

ప్రాంతీయపార్టీలకు తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలే ముఖ్యం. కనుక వాటికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకొంటాయి. కనుక ‘దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు’ అనే ఊహాజనితమైన ఆశయం కోసం అవి తమ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టబోవు. 

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో యూపిలో ఎక్కువ సీట్లు సాధించాలంటే సమాజ్‌వాదీ పార్టీ అక్కడ మంచి బలం ఉన్న కాంగ్రెస్ పార్టీతో జతకడుతుంది తప్ప ఫెడరల్ ఫ్రంట్ తో కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లోపాయికారీగా మద్దతు ఇవ్వడానికి సిద్దపడితేనే సమాజ్‌వాదీ వంటి పార్టీలు కెసిఆర్ తో చేతులు కలుపుతారు. కానీ కెసిఆర్ అందుకు సిద్దపడితే, తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఏవిధంగా వ్యవహరించాలి? ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముందు ఇటువంటి అనేక క్లిష్టప్రశ్నలకు సమాధానాలు కనుగొనవలసి ఉంటుంది.


Related Post