కాళేశ్వరానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

May 02, 2018


img

సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇదేరోజున అంటే మే 2, 2016న ముఖ్యమంత్రి కెసిఆర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. కేవలం రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టుకు పూర్తి రూపురేఖలు వచ్చేయి. ముఖ్యమంత్రి కెసిఆర్, సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు పట్టుదల, ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లు, ఆయా శాఖల ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కార్మికుల సమిష్టి కృషి అందుకు ప్రధాన కారణమని అందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టుకు నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి, పట్టుదల, తపనలను చూసి కేంద్రప్రభుత్వం కూడా దేశంలో మరే ప్రాజెక్టుకు ఇవ్వనంతవేగంగా అనుమతులు, అవసరమైన నిధులు అందిస్తూ తోడ్పడుతోంది. తాజాగా ఈ ప్రాజెక్టు నీటిపారుదల ప్రణాళికలను, ప్రాజెక్టు అంచనాలను ఆమోదించినట్లు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసింది. 

ప్రాజెక్టు పరిధిలో నీటి లభ్యతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కలను కేంద్ర నిపుణుల కమిటీ తీసిన లెక్కలతో పోల్చి చూసుకొని సంతృప్తి వ్యక్తం చేయడంతో నీటి లభ్యత పై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. కనుక నీటి లభ్యత, దాని వినియోగానికి సంబందించిన అనుమతులు మంజూరు చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 237 టిఎంసిల నీటి వినియోగించుకొనేందుకు కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా మరో  18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం దీనిని నిర్మిస్తోంది. అందుకు వీలుగా ఈ ప్రాజెక్టును రీ-డిజైన్ చేసింది. దానికీ కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం తెలిపింది. 

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ. 80,190.46 కోట్ల అంచనా వ్యయాన్ని కూడా కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం తెలిపింది. రాగల మూడేళ్ళకు వర్తించే ఈ అంచనా మొత్తంలో ప్రధాన పనులకు రూ. 33,145.44 కోట్లు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ. 47,045.02 కోట్లు ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం. 

ఈ ప్రాజెక్టుకు ఇదివరకే అటవీ, పర్యావరణ అనుమతులు, హైడ్రాలజీ తదితర ఏడు రకాల అనుమతులు లభించాయి. ఇప్పుడు తాజాగా లభించిన ఈ రెండు అనుమతులు ఈ ప్రాజెక్టుకు చాలా కీలకమైనవి. కనుక ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన అవరోధాలు అన్నీ తొలగిపోయినట్లే.


Related Post