కెసిఆర్ వ్యూహాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో?

May 02, 2018


img

“బక్కజీవి కెసిఆర్ చాలా మొండివాడు. పంతం పడితే వెనుతిరగడు..ఎత్తిన జెండాను దించడు..” ముఖ్యమంత్రి కెసిఆర్ తన గురించి తాను ప్లీనరీలో చెప్పుకొన్న మాటలివి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, దాని ఏర్పాటుకు కెసిఆర్ ముమ్ముర ప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కెసిఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ను భాజపా స్వాగతిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. కానీ తమ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తుంటే, మోడీ, అమిత్ షాలు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోంటారా? అంటే కాదనే చెప్పవచ్చు.

ఇంతకాలం భాజపాకు మిత్రపక్షంగా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా తమతో తెగతెంపులు చేసుకోగానే ఇప్పుడు ఏపి సర్కార్ తో కేంద్రం ఏవిధంగా వ్యవహరిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కేంద్రం అందిస్తున్న నిధులతో ఏపిలో అనేక రకాల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొన్నప్పటి నుంచి వాటికి నిధులు నిలిచిపోయాయని తెదేపా మంత్రులు, అధికారులు ఆరోపిస్తున్నారు.             

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు కెసిఆర్ వేగవంతం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలలో భాజపాకు సవాలు విసురుతున్న జెడిఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. భాజపాతో తెగతెంపులు చేసుకొన్న చంద్రబాబు నాయుడును కూడా కలుస్తానని సిఎం కెసిఆర్ స్వయంగా చెప్పారు. కనుక భాజపా వ్యతిరేకశక్తులను కూడగట్టి దానిని దెబ్బతీయబోతున్నారు కనుక తెరాస సర్కార్ పై కూడా కేంద్రం కక్షసాధింపు చర్యలకు పూనుకొన్నా ఆశ్చర్యం లేదు.

ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు బాగానే ఉన్నాయి కనుక ఎయిమ్స్ వంటి సంస్థలు మంజూరు అయ్యాయి. కానీ కెసిఆర్ తమ పార్టీకి నష్టం కలిగిస్తుంటే మోడీ, అమిత్ షాలు లైట్ తీసుకొని రాష్ట్రానికి యధాప్రకారం సహాయసహకారాలు అందిస్తూనే ఉంటారా? ఎయిమ్స్ నిర్మాణానికి నిధులు, అనుమతులు మంజూరు చేస్తారా? కేంద్ర నిధులతో రాష్ట్రంలో సాగుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు యధాతధంగా అందిస్తూనే ఉంటారా? అంటే సమాధానం అందరికీ తెలుసు. అటువంటి సమస్యలు తలెత్తితే వాటిని కెసిఆర్ ఏవిధంగా పరిష్కరించుకొంటారో వేచి చూడాల్సిందే.


Related Post