కర్ణాటక మంత్రులు అవినీతిపరులు: మోడీ

May 01, 2018


img

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం కర్ణాటకలో ఛామ్ రాజ్ నగర్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. “కర్ణాటకలో అవినీతి, అరాచకపరిస్థితులు సర్వత్రా నెలకొనున్నాయి. రాష్ట్రంలో చట్టాలు అమలుకావడం లేదు...శాంతిభద్రతలు అదుపు తప్పాయి. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులు అందిస్తామంటున్నా తీసుకోకుండా, మళ్ళీ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడి తప్పాయి,” అని విమర్శించారు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ, “ఆయనకు ఎంతసేపు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలనే యావ తప్ప మరొకటిలేదు. ప్రధానమంత్రి పదవి తన వారసత్వపు హక్కని భావిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో పెద్దలైన తన తల్లి సోనియా గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తదితర సీనియర్ల మాటలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుంటారని కాంగ్రెస్ నేతలే చెవులు కొరుకొంటున్నారు. కర్ణాటకలో గత 5 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఐదేళ్ళలో రాష్ట్రాభివృద్ధి కోసమే ఏమి చేసిందో రాహుల్ గాంధీ చెప్పగలరా?కాంగ్రెస్ నేతలు అందరూ మాటలకే పరిమితం అని సిద్దరామయ్య ప్రభుత్వమే నిరూపిస్తోంది. కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన కర్ణాటక ప్రజలు ఈసారి భాజపానే గెలిపించబోతున్నారు. భాజపాను గెలిపిస్తే కర్ణాటక మళ్ళీ అభివృద్ధిబాట పడుతుంది,” అని అన్నారు.  

యూపి ఎన్నికల సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంచుమించు ఇటువంటి మాటలే చెప్పి భాజపాను గెలిపించుకొన్నారు. యోగీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్రంలో వందలాది పసిపిల్లల మరణాలు, దళితులు, మైనార్టీలపై గోరక్షక్ దాడులు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. మీడియాలో రోజూ వస్తున్న అత్యాచార ఘటనల వార్తలలో ఎక్కువగా భాజపా పాలిత యూపిలోనే జరుగుతున్నవే కనిపిస్తున్నాయి. 

కర్ణాటకలో భాజపా గెలిస్తే అవినీతి ఆరోపణలలో జైలుకు వెళ్ళివచ్చిన యెడ్యూరప్ప ముఖ్యమంత్రి అవుతారు. గాలి జనార్ధన్ రెడ్డి వర్గం మళ్ళీ రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే నటుడు ప్రకాష్ రాజ్ భాజపాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘దేశంలో యెడ్యూరప్ప అంత అవినీతిపరుడు మరొకడు లేడని’ సాక్షాత్ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోరుజారారు. అటువంటి అవినీతిపరుడిని ముందుంచుకొని, కాంగ్రెస్, ఇతర పార్టీలను భాజపా నేతలు విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ ఎన్నికలు కర్ణాటక ప్రజల విజ్ఞతకు పరీక్షవంటివి. వారు సమర్ధులైన నేతలను ఎన్నుకొంటారని ఆశిద్దాం.


Related Post