కెసిఆర్ కారణంగానే జెడిఎస్ ఆ నిర్ణయం?

May 01, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల బెంగళూరు వెళ్ళి జెడిఎస్ నేతలు దేవగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించిన తరువాత ఆ పార్టీకి మద్దతు ప్రకటించి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో దాని తరపున ప్రచారం చేయడానికి సిద్దమని ప్రకటించారు. కెసిఆర్ బాటలోనే నడుస్తున్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా జెడిఎస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వస్తానని ప్రకటించారు. 

ఈ సానుకూల పరిణామాల కారణంగా జెడిఎస్ లో ఆత్మవిశ్వాసం పెరిగినట్లుంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో మా పార్టీ విజయం సాధించడం ఖాయం. నేను కింగ్ మేకర్ కాదు...కింగ్ అవుతాను. ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాక ‘హంగ్’ ఏర్పడితే మేము ప్రతిపక్ష బెంచీలలో కూర్చోంటాము లేదా మళ్ళీ ఎన్నికలకు సిద్దపడతాము తప్ప కాంగ్రెస్, భాజపాలలో దేనికీ మద్దతు ఈయబోము,” అని అన్నారు. 

కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో జెడిఎస్ భాగస్వామి కావాలనుకొంటే, అది కాంగ్రెస్, భాజపాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. ఈవిషయం కెసిఆర్ దేవగౌడకు ముందే స్పష్టం చేసి ఉండవచ్చు. బహుశః అందుకే కుమారస్వామి ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. 

ఒకవేళ ఎన్నికల తరువాత హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, భాజపాలలో దేనికైనా జెడిఎస్ మద్దతు ఇస్తే ఫెడరల్ అది ఫ్రంట్ స్ఫూర్తికే విరుద్దమవుతుంది. ఒకవేళ కెసిఆర్ మద్దతు తీసుకొని ఎన్నికల తరువాత భాజపాకు జెడిఎస్ మద్దతు పలికినట్లయితే, కెసిఆర్, ఫెడరల్ ఫ్రంట్ విశ్వసనీయత దెబ్బతింటుంది. ‘కాంగ్రెస్ పార్టీ ని ఓడించి భాజపాకు లబ్ది చేకూర్చేందుకే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారనే’ కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుంది. 

కుమారస్వామి తాజా ప్రకటనను బట్టి జెడిఎస్ పై కెసిఆర్ ప్రభావం చూపినట్లే భావించవచ్చు. కానీ జెడిఎస్ తన ఈ మాటకు కట్టుబడి ఉంటుందా లేక అధికారం కోసం కాంగ్రెస్, భాజపాలలో ఏదో ఒక పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వంలో పాలుపంచుకొంటుందా? అనే విషయం ఎన్నికల తరువాతకానీ తెలియదు. మే 12న కర్ణాటక ఎన్నికలు జరుగుతాయి. మే 15వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. 


Related Post