పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి భాజపాకు విజయం సాధించిపెట్టేందుకు, తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. నిజం చెప్పాలంటే, కెసిఆర్ అనుకోకుండా ముఖ్యమంత్రి అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే, కెసిఆర్ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకొన్నారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటూ సరికొత్త నాటకానికి తెరతీశారు. అయితే ఆయన చేస్తున్న ఈ ప్రతిపాదనకు ఎవరూ మద్దతు పలకకపోవడం అందరూ గమనిస్తూనే ఉన్నారు.
కెసిఆర్ నిన్న చెన్నై వెళ్ళి డిఎంకె నేత స్టాలిన్ ను కలిసినప్పుడు, కావేరీ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న జెడిఎస్ తో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లో ఏవిధంగా పనిచేయగలమని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాలంటే ముందుగా ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలగాలి. కానీ అది సాధ్యం కాదు. అలాగే మా పార్టీతో అనుబంధం ఉన్న నేతలను ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆకర్షించాలని కెసిఆర్ విఫలయత్నం చేస్తున్నారు. కానీ అయన ప్రయత్నాలు, ఆశలు ఫలించవు. ముందు తన పార్టీలో అంతర్గత సమస్యలను, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ఫెడరల్ ఫ్రంట్ పేరు చెప్పి కెసిఆర్ దేశాటన చేయడం సరికాదు,” అని అన్నారు.