జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు అవసరమని వాదిస్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తుంటే, రాష్ట్ర రాజకీయాలలో కూడా గుణాత్మకమైన మార్పు చాలా అవసరమని సిపిఎం నేతృత్వంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్), ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణా జనసమితి (టిజెఎస్) ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్, భాజపాలను కెసిఆర్ నిందిస్తుంటే, బిఎల్ఎఫ్, టిజెఎస్, కాంగ్రెస్, భాజపా, తెదేపా తదితర ప్రతిపక్షపార్టీలు కెసిఆర్ పాలనతీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
నిన్న తెలంగాణా జనసమితి ఆవిర్భావసభలో ప్రొఫెసర్ కోదండరాం తెరాస సర్కార్ విధానాలను, లోపాలను, అవినీతిని చాలా నిశితంగా విమర్శించారు. కాంగ్రెస్ నేతలు నిత్యం తెరాస సర్కార్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తెరాస నేతలు మళ్ళీ వారిపై ఎదురుదాడి చేయవచ్చు.
రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతివిమర్శలు సర్వసాధారణ విషయమే. కానీ రాష్ట్రంలో చాలా జోరుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రతిపక్షాలు తెరాస సర్కార్ ను ఎందుకు విమర్శిస్తున్నాయి?
అలాగే నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అవినీతిరహిత పాలన అందిస్తూ, పాలనలో పారదర్శకత, అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అలాగే ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా దేశంలో శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మౌలికవసతుల కల్పనకు మోడీ సర్కార్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. బలమైన పారిశ్రామిక, విదేశీ విధానాలను అమలు చేస్తూ ప్రపంచదేశాలలో భారత్ మళ్ళీ తలెత్తుకొనేలా చేస్తున్నప్పుడు, కెసిఆర్, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మోడీ సర్కార్ తీరుపట్ల ఎందుకు పెదవి విరుస్తున్నాయి? అనే సందేహం కలుగుతుంది.
ఈ అసంతృప్తికి కారణం నిజంగా రాష్ట్రం, దేశం అభివృద్ధి కావడంలేదనే బాదేనా? ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదనే బాదే కారణమా అని ఆలోచిస్తే మన రాజకీయపార్టీల, వాటి నాయకుల తీరును చూస్తున్నప్పుడు అదే కారణమని ఎవరూ నమ్మలేరు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రి అవుదామనుకొంటే ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. అలాగే గత పదేళ్ళుగా ప్రతిపక్ష బెంచీలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోను, ఇటు తెలంగాణా రాష్ట్రంలోను అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నించడం కూడా సహజమే. వాటి పరస్పర ఆరోపణలు, విమర్శలు, చేస్తున్న ప్రయత్నాలు అన్నీ అధికారం కోసమేనని అర్ధమవుతోంది. తెరాసతో సహా దేశంలో అన్ని రాజకీయపార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం కోసమే నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటారని కెసిఆరే స్వయంగా చెప్పారు. అది నూటికి నూరు శాతం నిజమని అర్ధమవుతోంది.
కనుక అయన డిల్లీ పీఠంపై కన్నేసి ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెరపైకి తెస్తే, రాష్ట్రంలో అధికార పగ్గాల కోసం పాత, కొత్త పార్టీలు, కూటములు ఆరాటపడుతున్నాయని భావించవలసి ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే అన్ని పార్టీలు అధికారం కోసమే ఆరాటపడుతున్నాయని చెప్పక తప్పదు. లేకుంటే ఇంత శ్రమపడవలసిన అవసరమే లేదు కదా?