ఫెడరల్ ఫ్రంట్ తో మార్పు సాధ్యమేనా?

April 30, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించడానికి ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నేతలతో చర్చిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయన నిన్న చెన్నై వెళ్ళి డిఎంకె నేతలను కలిశారు. కాంగ్రెస్, భాజపాలు  దేశాన్ని భ్రష్టు పట్టించాయని, వాటిని వదిలించుకోవలసిన సమయం ఆసన్నమైందని కెసిఆర్ ఏవిధంగా వాదిస్తున్నారో, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఇంతకాలంగా పరిపాలిస్తున్న అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలు భ్రష్టు పట్టించాయని, వాటిని వదిలించుకోవలసిన సమయం ఆసన్నమైందని చెపుతూ కమల్ హాసన్ కొత్త పార్టీ స్థాపించారు. ఇంచుమించు అదే కారణంతో రజనీకాంత్ కూడా పార్టీ పెట్టడానికి సిద్దపడుతున్నారు. ఇక స్పెక్ట్రం కేసులో మాజీ కేంద్రమంత్రి ఏ.రాజా, కరుణానిధి కుమార్తె కనిమోళి తీహార్ జైలులో గడిపివచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కెసిఆర్ నిన్న చెన్నైలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అయన వెనుకే ఏ రాజా నిలబడి ఉన్నారు. 

తమిళనాడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, అవినీతి కేసులను ఎదుర్కొంటున్న డిఎంకెను, ‘ఓటుకు నోటు కేసులో ప్రధమ ముద్దాయి’ అని స్వయంగా ఆరోపించిన చంద్రబాబు నాయుడిని ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిని చేసుకొంటామని కెసిఆర్ చెపుతున్నారు. పైగా కెసిఆర్-సిబిఎన్ మద్య సత్సంబంధాలు లేవు. వారిరువురికీ ఒకరిపట్ల మరొకరికి అభిమానం, గౌరవం లేవు. కారణాలు అందరికీ తెలుసు. అందుకే కెసిఆర్ సాటి తెలుగువాడైన చంద్రబాబు నాయుడును కలవకుండా ఎక్కడెక్కడివారినో కలుస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. 

ఇదే పనిమీద త్వరలోనే లక్నో వెళ్ళి యూపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలువబోతున్నట్లు కెసిఆర్ నిన్న చెప్పారు. యూపిని పదేళ్ళు పాలించిన అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, సమాజ్ వాదీ నేతలు అరాచకాలు సృష్టించారనే ఆగ్రహంతో ఆ రాష్ట్ర ప్రజలు గత ఏడాది జరిగిన యూపి అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ ను దింపి భాజపాను గెలిపించారు. ఇక కెసిఆర్ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామనుకొంటున్నారో అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో అఖిలేష్ యాదవ్ కు మంచి స్నేహం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. మమతా బెనర్జీ- సోనియా గాంధీల మద్య ఉన్న అనుబందం అందరికీ తెలిసిందే. అలాగే కాంగ్రెస్-డిఎంకెల మద్య అనుబంధం ఉంది.  

కాంగ్రెస్ తో అంటకాగుతున్న ఇటువంటి పార్టీలతో, స్వచ్చమైన రికార్డులేని నేతలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం సాధ్యమే కానీ దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు ఏవిధంగా సాధ్యం? అనే సందేహం కలుగుతోంది. దీనికి కెసిఆర్ సమాధానం చెప్పకపోయినా కాలం తప్పకుండా సమాధానం చెపుతుంది.


Related Post