ఫెడరల్ ఫ్రంట్ కు స్వాగతం: అమిత్ షా

April 30, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ను తమ పార్టీ స్వాగతిస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయ పార్టీలు, రాజకీయ కూటములు ఏర్పాటుచేసుకొనే స్వేచ్చ,హక్కు కలిగి ఉన్నారని కనుక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నానని చెప్పారు.

కెసిఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ రానున్న ఎన్నికలలో భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చి దానికి మేలు కలిగించడానికేనని, అది భాజపాకు ‘బి’పార్టీ వంటిదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును భాజపా స్వాగతిస్తోందని అమిత్ షా యధాలాపంగా చెప్పడం ద్వారా దాని విశ్వసనీయతపై అనుమానాలు రేకెతించినట్లయింది.  

ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడుతున్న సర్వేలను తాను నమ్మబోనని, ఈ ఎన్నికలలో భాజపాయే ఖచ్చితంగా గెలుస్తుందని అన్నారు. ఒక నెల క్రితం వెలువడిన సర్వే ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని చెప్పగా, తాజా సర్వే ఫలితాలలో కాంగ్రెస్, భాజపాలు సరిసమానంగా సీట్లు సాధిస్తాయని కనుక ఈసారి ‘హంగ్’ ఏర్పడబోతోందని తేల్చి చెప్పాయి. అంటే ఎన్నికల ప్రచారం తరువాత భాజపా కొంచెం పుంజుకొని అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది కానీ అమిత్ షా చెప్పుకొంటున్నట్లుగా భాజపా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. 

అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అవినీతి చక్రవర్తిగా పేరొందిన యెడ్యూరప్పను భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంచుకోవడం, అక్రమాలకు, అవినీతికి మారుపేరైన గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి 9 టికెట్లు కేటాయించడం, కుల సమీకరణాలలో మార్పులు ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి. భాజపాకు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అవినీతిపరుల చేతిలో పెట్టినట్లవుతుందని కాంగ్రెస్ నేతలు గట్టిగా చేస్తున్న ప్రచారానికి భాజపా నేతలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.     

కర్ణాటక ఎన్నికలలో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దేవగౌడ నాయకత్వం వహిస్తున్న జెడిఎస్ తరపున తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేయడానికి సంసిద్దత వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జెడిఎస్ తరపున ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కనుక కర్ణాటకలో ఎన్నికల తరువాత హంగ్ ఏర్పడి జెడిఎస్ ‘కింగ్ మేకర్’ గా అవతరించే అవకాశం కనిపిస్తోంది. 

కానీ ఒకవేళ అప్పుడు కెసిఆర్ బలపరిచిన జెడిఎస్ అధికారం కోసం భాజపాతో చేతులు కలిపినట్లయితే, కాంగ్రెస్ అనుమానాలు నిజమని నమ్మవలసి వస్తుంది. ఆ కారణంగా ఫెడరల్ ఫ్రంట్ విశ్వసనీయత కూడా దెబ్బతినవచ్చు. 


Related Post