రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పధకాలు అమలుచేస్తున్నప్పటికీ, నేటికీ రైతుల సమస్యలు తీరడమేలేదు. రైతులు రోడ్లపైకి ధర్నాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అనేక జిల్లాలలో రైతులు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, మార్కెట్లకు తెచ్చిన ఉత్పత్తులను తక్షణమే కొనుగోలు చేయాలని, దళారీ వ్యవస్థను తొలగించాలని, మార్కెట్ యార్డులలో తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు జగిత్యాల, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలలో రైతులు ఆందోళన చేశారు. కొన్ని చోట్ల ఇంకా చేస్తూనే ఉన్నారు. అన్నదాతలు ఈవిధంగా రోడ్లెక్కి ఆందోళనలు చేయవలసిరావడం నిజంగా చాలా బాధాకరమే.
కానీ ఈ సమస్యను మరో కోణంలో నుంచి చూస్తే, ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ఉచిత విద్యుత్, వివిధ కొత్త ప్రాజెక్టులు, కాలువలు చెరువుల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తునందునే పంట దిగుబడి పెరిగినట్లు చెప్పవచ్చు. ఇదే నిజమనుకొంటే, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో మరింత భూమి సాగులోకి వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలన్నీ అమలైనట్లయితే మున్ముందు రాష్ట్రంలో పంట ఉత్పత్తి చాలా బారీగా పెరిగే అవకాశం ఉందని అర్ధం అవుతోంది.
కనుక వ్యవసాయానికి సాగునీరు అందించడమే కాకుండా, దాని వలన పెరిగే పంటదిగుబడిని నిలువచేసుకొనేందుకు బారీ గోదాములు, పంటలను అమ్ముకొనేందుకు కొత్త మార్కెట్ యార్డులు, గిట్టుబాటు ధరతోనే సరిపెట్టుకొంటున్న రైతులకు తమ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముకొని లాభాలు ఆర్జించేందుకు వీలుగా బలమైన మార్కెటింగ్ వ్యవస్థలను, అలాగే ఎక్కడికక్కడ ఫుడ్కు ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకొని అందుకు అవసరమైన పనులు మొదలుపెట్టడం చాలా అవసరం. లేకుంటే ‘డిమాండ్ అండ్ సప్లై’ ఫార్ములా ప్రకారం మరింత ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గితే అప్పుడు రైతులు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మున్ముందు అవి మరింత పెరుగవచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే అందుకు తగ్గ ప్రణాళికలను సిద్దం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉండటం చాల మంచిది.