కొంపల్లిలో ఈరోజు జరిగిన తెరాస ప్లీనరీలో ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వజ్రాలలాంటి వారని, ఇంతకంటే గొప్ప ఎమ్మెల్యేలు ఆకాశం నుంచి ఊడిపడరని కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇస్తానని ఇక అందరూ నిశ్చింతగా ఉండవచ్చని ప్రకటించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చేయించిన మూడు సర్వేలలో ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు కానీ కొందరు ఎమ్మెల్యేల పనితీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. ముఖ్యమంత్రి కెసిఆర్ వారందరినీ పనితీరు మెరుగుపరుచుకోవాలని, వీలైనంతవరకు ప్రజలలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేయాలని లేకుంటే వచ్చే ఎన్నికలలో టికెట్స్ లభించవని గట్టిగా హెచ్చరించారు. కానీ ఇవాళ్ళ ప్లీనరీలో ఎమ్మెల్యేలందరికీ ఈ శుభవార్త చెప్పడంతో ఎమ్మెల్యేలు అందరూ ఆనందంతో పొంగిపోయారు.
వచ్చే ఎన్నికలలో తెరాస సర్కార్ పనితీరు ఆధారంగానే ప్రజలు ఓట్లు వేయబోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే తెరాస ఎంపిల పనితీరు, మంచి ప్రజాధారణ పొందుతున్న కేటిఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింసింహారెడ్డి వంటి మంత్రులను, ముఖ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను చూసి ప్రజలు ఓట్లు వేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కనుక తెరాస తరపున ఎవరిని నిలబెట్టినా విజయం సాధించగలమనే నమ్మకంతోనే కెసిఆర్ ఈ హామీ ఇచ్చి ఉండవచ్చు. ఇది ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
కానీ ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే తెరాస ఎన్నికలకు వస్తే, కాంగ్రెస్ పార్టీ అవలీలగా విజయం సాధించగలదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడో చెప్పారు. కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉన్నప్పుడు కెసిఆర్ ఈవిధంగా ఎమ్మెల్యేలకు హామీ ఇవ్వడం ఆశ్చర్యకరమే.