నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై డికె అరుణ వర్గం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తునందున, గుట్టు చప్పుడు కాకుండా ఆయనను పార్టీలో చేర్చుకోవడం చాలా విచిత్రంగా ఉంది. నాగంను పార్టీలో చేర్చుకొంటునప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు రోజు రాత్రి డిల్లీ వెళ్ళారు.
నాగంను పార్టీలో చేర్చుకోబోతున్నారనే విషయం మీడియా ద్వారా డికె అరుణ వర్గంతో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరికీ తెలిసి ఉన్నప్పటికీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా ఆ విషయాన్ని హైదరాబాద్ లో అధికారికంగా ప్రకటించలేదు. ప్రకటిస్తే డికె అరుణ వర్గం నుంచి సమస్యలు రావచ్చనే ఉద్దేశ్యంతో ప్రకటించలేదని వేరే చెప్పనవసరం లేదు. కానీ ప్రకటించకపోయినా డికె అరుణ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తమతో మాట మాత్రంగానైనా చెప్పకుండా నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకొన్నారని, ఆయనను అంత రహస్యంగా చేర్చుకోవలసిన అవసరం ఏమిటని నిలదీశారు.
వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు నాగం జనార్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని నాగం అనుచరులు చెప్పుకొంటున్నారని అది నిజమా కాదా? అని నిలదీశారు. జైపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ఇద్దరూ కలిసి నాగంను పార్టీలోకి రప్పించి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టాలని యోచిస్తున్నారని దామోదర్ రెడ్డి ఆరోపించారు. నాగం జనార్ధన్ రెడ్డి వలన కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుందని, అటువంటి వ్యక్తిని పార్టీలో గుట్టుగా చేర్చుకోవడాన్ని దామోదర్ రెడ్డి తప్పు పట్టారు. ఈవిషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు చేశారని దామోదర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.