ప్లీనరీలో కెసిఆర్ ఏమి చెప్పబోతున్నారో?

April 27, 2018


img

హైదరాబాద్ శివారులో కొంపల్లి వద్ద తెరాస ప్లీనరీ మరికొన్ని నిమిషాలలో ప్రారంభం కాబోతోంది. ఈసారి ఒక్కరోజు మాత్రమే ప్లీనరీ జరుగుతున్నప్పటికీ దానిలో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, కెసిఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడంపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నామని తెరాస నేతలు ప్రకటించడం ద్వారా ప్లీనరీకి హైప్ క్రియేట్ చేయగలిగారని చెప్పవచ్చు. తద్వారా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, మీడియా దృష్టిని ఆకర్షించగలిగారనే చెప్పవచ్చు. ఆ విషయం ప్లీనరీకి రాబోయే మీడియా కవరేజ్, ధర్డ్ ఫ్రంట్ పట్ల ఇకపై రాజకీయ పార్టీల స్పందనతో తెలుస్తుంది. ప్లీనరీ పట్ల ఆసక్తి రేకెత్తించగలిగారు కనుక దానిలో సిఎం కెసిఆర్ ఏమి చెప్పబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో కెసిఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం దాదాపు ఖాయం అని తెరాస నేతల మాటలద్వారా స్పష్టమయింది కనుక తన రాజకీయ వారసుడైన మంత్రి కేటిఆర్ ను ఈ ప్లీనరీలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి కల్పిస్తారా లేదో చూడాలి. కానీ ఆవిధంగా చేస్తే పార్టీలో సమస్యలు వస్తాయనుకొంటేఆ ఆలోచన వచ్చే ఏడాదికి వాయిదా వేయవచ్చు. 

ఇక రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కెసిఆర్ ఏమి చెప్పబోతున్నారో అందరూ ఊహించుకోవచ్చు కానీ వచ్చే ఎన్నికలకు సంబంధించిన విషయాలు, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, కేటిఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అనే మూడు అంశాలపై ఈ ప్లీనరీలో ఏమి చెప్పబోతున్నారనేదే చాలా ఆసక్తికరమైన విషయాలు. తినబోతూ గారెల రుచి అడగడం ఎందుకు అన్నట్లు ప్లీనరీ ప్రారంభం అయ్యాక ఏమి చెపుతారో అని ఆలోచించడం అనవసరమే. మరికొన్ని గంటలలోనే అన్ని విషయాలపై స్పష్టత రావచ్చు.


Related Post