తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొంపల్లిలో 17వ ప్లీనరీ సమావేశం జరుగబోతున్నాయి. ప్లీనరీ జరిగే సభా ప్రాంగణానికి ‘ప్రగతి ప్రాంగణం’ గా నామకరణం చేశారు.
ప్లీనరీ కమిటీలు ఈ సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్లీనరీ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి సుమారు 13,000 మంది ప్రతినిధులు రాబోతున్నారు. అలాగే ఈ ప్లీనరీలో పాల్గొనేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, న్యూజిల్యాండ్, స్వీడన్, ఫిన్ ల్యాండ్, పోలాండ్, నార్వే, డెన్మార్క్, జపాన్, మలేషియా, సింగపూర్, ఖతార్, తదితర 24 దేశాల నుంచి 125 మంది ఎన్ఆర్ఐలు కూడా హాజరుకాబోతున్నారు.
ప్లీనరీకి హాజరయ్యే వారికి వివిధ రకాల సేవలు అందించేందుకు 2,000 మంది వాలంటీర్లను తెరాస ఏర్పాటు చేసుకొంది.
ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలుప్రాంతాలు గులాబీ రంగు అలుముకొన్నాయి. మెట్రో పిల్లర్లపై కెసిఆర్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. నగర శివార్లలో స్వాగత ద్వారాలు, తెరాస జెండాలు, తోరణాలు, బారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిలో కెసిఆర్ చిత్రం క్రింద ‘కారణజన్ముడు’ అని వ్రాసిన బ్యానర్ అందరినీ ఆకట్టుకొంటోంది.
మండు వేసవిలో ఈ ప్లీనరీ జరుగుతోంది కనుక ఎక్కడికక్కడ కూలర్లు ఏర్పాటు చేసి, చల్లటి మంచి నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, అంబలి అందుబాటులో ఉంచారు. అలాగే ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు తెలంగాణా వంటకాలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన వంటలు కూడా వడ్డించబోతున్నారు. శాఖాహారం, మాంసాహారం రెండూ వేర్వేరుగా వడ్డిస్తున్నారు.
ప్లీనరీలో పాల్గొనే ప్రతినిధులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వారికి తక్షణం చికిత్స చేసేందుకు నలుగురు వైద్యులు, 15మంది సిబ్బంది, నాలుగు అంబులెన్సులు సిద్దంగా ఉంచారు.
ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల కోసం గులాబీ, ఆకుపచ్చ,నీలం, గోధుమ, కాషాయ తదితర రంగులలో 12 రకాల పాసులను ముద్రించారు. పార్టీ ప్రతినిధులు, విఐపిలు, ఎన్ఆర్ఐలు, మీడియా, సాంస్కృతిక బృందాలు...ఇలాగ ఒక్కో వర్గానికి ఒక్కో రంగులో పాసులు ముద్రించి అందజేశారు.
రేపు జరుగబోయే ప్లీనరీలో జాతీయ రాజకీయాలు, వ్యవసాయం, సంక్షేమం, పరిపాలన సంస్కరణలు, మైనార్టీ సంక్షేమం, మౌలిక సదుపాయాలు.. ఈ ఆరు ప్రధాన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అయితే జాతీయ రాజకీయాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్లీనరీలోనే కెసిఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నారు కనుక రేపు జరుగబోయే ప్లీనరీలో మంత్రి కేటిఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో రేపే తేలిపోతుంది.