ఏపి తెదేపా నేతల అనుమానాలు నిజమవబోతున్నాయి. త్వరలోనే భాజపా-వైకాపాలు చేతులు కలుపబోతున్నాయి. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు అందుకు రంగం సిద్దం చేస్తున్నట్లుగా ఉన్నాయి.
“ఎన్డీయే నుంచి తెదేపా బయటకు వెళ్ళిపోవడం చాలా తొందరపాటు నిర్ణయం. ఏపికి బారీగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉంది. కనుక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెదేపా మళ్ళీ ఎన్డీయేలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వైకాపాను కూడా ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నాము. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని దోషిగా ఏ కోర్టు నిర్ధారించలేదు. కనుక అతను అవినీతికి పాల్పడ్డాడని తెదేపా నేతలు ఆరోపణలు చేయడం సరికాదు. జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరుతారా లేక తక్షణమే చేరుతారా? అనేది అయన ఇష్టం. ఆయన ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు ఎన్డీయేలో చేరవచ్చు. ఏపిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు ఏ పార్టీ ముందుకు వచ్చినా దానితో కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు. తెదేపా కూడా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నాము,” అని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు.
తెదేపా తిరిగి రావాలని కోరుతూనే అది కాకపోతే వైకాపా సిద్దంగా ఉందని అయన చెపుతున్నారని భావించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాల అనుమతి లేకుండా రాందాస్ అథవాలే వైకాపాను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తారనుకోలేము. కనుక వారిరువురి అనుమతితోనే అయన వైకాపాతో భాజపా జత కట్టడానికి సిద్దంగా ఉందని ప్రకటించినట్లు భావించవచ్చు.
గత నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏనాడూ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనలేదు. అయన డిల్లీలో పోరాడినప్పటికీ, అయన పోరాటాలు అన్నీ చంద్రబాబు నాయుడుపైనే తప్ప మోడీపై కాదనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇంతకాలం ఎన్డీయేలో భాగస్వామిగా, భాజపాకు మిత్రపక్షంగా ఉన్న తెదేపా మోడీ సర్కార్ పై నేరుగా అనేక విమర్శలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలను మోడీ సర్కార్ మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేసి ఇప్పుడు తిరిగి వెనక్కు వెళ్ళలేని పరిస్థితి కల్పించుకొంది. కనుక భాజపా-వైకాపాల దోస్తీ ఖాయమనే భావించవచ్చు.