దేశప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారు

April 26, 2018


img

తెరాసకు ఒక అలవాటుంది. తమ ప్రభుత్వం ఏ పని చేపట్టినా లేదా దానికి ఏదైనా ఆలోచన వచ్చినా అది ‘నభూతో నభవిష్యత్’ అన్నట్లు ఆ పార్టీ నేతలందరూ దాని గురించి గొప్పగా వర్ణించడం మొదలుపెట్టేస్తారు. ఇప్పుడు ధర్డ్ ఫ్రంట్ గురించి వారు చెపుతున్న మాటలు కూడా అలాగే ఉన్నాయి.

దేశంలో తమంతట తాముగా అధికారంలోకి రాలేవని గుర్తించిన కాంగ్రెస్, భాజపాలు యూపియే, ఎన్డియే కూటములు ఏర్పాటు చేసుకొన్న సంగతి అందరికీ తెలుసు. 1989-91లోనే స్వర్గీయ ఎన్టీఆర్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పడి కేంద్రంలో అధికారంలోకి కూడా వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వామపక్షాలు ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తెలంగాణాలో ఇటీవలే సిపిఎం అధ్వర్యంలో 28 పార్టీలతో కూడిన ‘బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్’ ఏర్పాటయింది. అంటే ఫ్రంట్ ఏర్పాటు అనేది కొత్త ఆలోచన కాదని అర్ధమవుతోంది. కానీ కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ధర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ‘అసామాన్యమైనది’ అన్నట్లు తెరాస నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. 

తెలంగాణాలో తెరాసకు ఎదురులేకుండా చేసుకోవడానికి బారీ ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు దానికి ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ అనే అందమైన పదాన్ని కనిపెట్టినట్లుగానే, ఇప్పుడు ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనకు ‘దేశరాజకీయలలో గుణాత్మకమైన మార్పు’ కోసం అనే మరో కొత్త పదాన్ని కెసిఆర్ కనిపెట్టి చెపితే తెరాస నేతలు దానిని వల్లెవేస్తున్నారు. అయితే అధికారం కోసం అలమటించిపోయే అవకాశవాద ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ కలిసి ‘దేశరాజకీయలలో గుణాత్మకమైన మార్పు’ ఏవిధంగా సాధించగలవో ఎవరూ చెప్పడం లేదు కానీ మాది ‘అల్లాటప్పా ఫ్రంట్’ కాదని మాత్రం గట్టిగా చెప్పుకొంటున్నారు. 

మంత్రి జగదీశ్ రెడ్డి మరో అడుగుముందుకు వేసి దేశ భవిష్య రాజకీయాలను తెరాస ప్లీనరీ నిర్దేశించబోతోందని, దేశప్రజలు అందరూ కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని చెప్పడం చాలా అతిశయంగా ఉంది. తెలంగాణా ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్, ఆ తరువాత తనే ఆ పదవి చేపట్టాలనుకొన్నప్పుడు కూడా “రాష్ట్ర ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారు” అని తెరాస నేతలు గట్టిగా చెప్పుకొన్నారు. ఇప్పుడు 'దేశ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని ' తెరాస నేతలు చెపుతున్నారంటే ప్రధానమంత్రి కావాలనే కోర్కెతోనే కేసిఆర్ ధర్డ్ ఫ్రంట్ స్థాపిస్తున్నారా? అనే అనుమానం కలిగించారు మంత్రి జగదీశ్ రెడ్డి. అదే నిజమనుకొంటే, 'గుణాత్మకమైన మార్పు'కు అర్ధం అదేనా? అనే ఆలోచన కలుగుతోంది.   

అయితే తెరాస సర్కార్ పాలనకు మంచి మార్కులే పడుతున్న మాట వాస్తవం. మోడీ సర్కార్ కూడా తాము అత్యద్భుతంగా పాలిస్తున్నామని చెప్పుకొంటోంది. కానీ తెరాసతో సహా అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కనుక తెరాస సర్కార్ కు అదే సూత్రం వర్తిస్తుంది. మంచిపాలన వేరు రాజకీయాలు వేరనే సంగతి అందరికీ తెలుసు. తెరాస సర్కార్ బయట మంచి మార్కులే సంపాదించుకొంటున్నప్పటికీ, రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెరాస సర్కార్ అప్రజాస్వామిక, నిరంకుశ పాలన చేస్తున్న తెరాసను గద్దెదించక తప్పదని కాంగ్రెస్, బిఎల్ఎఫ్, టిజెఎస్ (ప్రొఫెసర్ కోదండరాం) తదితర పార్టీలు గట్టిగా వాదిస్తున్నాయి. అంటే తెరాసకు ‘ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత’ అన్నట్లుందని అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలో యావత్ దేశానికి తెరాస దిశానిర్దేశం చేస్తుందని చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉంది. 

ఇక జైల్లో కూర్చొన్న లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి ఒక డజనుకు పైగా నేతలు ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలని కలలుకంటున్నారు. వారు ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సహకరించవచ్చునేమో కానీ కెసిఆర్ దేశానికి ప్రధానమంత్రి అవుతానంటే అంగీకరించరని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కాకముందే దాని గురించి తెరాస నేతలు  గొప్పలు చెప్పుకొంటే చివరికి వారే నవ్వులపాలయ్యే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిది.


Related Post