బాబుతో గవర్నర్ అత్యవసర భేటీ..దేనికో?

April 23, 2018


img

గవర్నర్ నరసింహన్ ఆదివారం విజయవాడ వెళ్ళి ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. అయన శనివారం విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత అదేరోజు సాయంత్రం విమానంలో హైదరాబాద్ తిరిగివెళ్ళిపోవలసి ఉండగా, రైల్లో విజయవాడ చేరుకొని చంద్రబాబుతో సమావేశంకావడం విశేషం.

ఏప్రిల్ 20న చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన ధర్మదీక్షలో నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి చాలా అనుచితవ్యాఖ్యలు చేశారు. వాటిపై భాజపా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భాజపా నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసి బాలకృష్ణపై పిర్యాదు చేశారు కూడా. ధర్మదీక్ష ముగింపు సభలో ప్రసంగించిన చంద్రబాబు, రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు విశ్రమించేదిలేదని, ఇకపై తమ పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని అన్నారు. ఈ నేపధ్యంలో గవర్నర్ నరసింహన్ విజయవాడ వచ్చి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశం కావడం చాలా ప్రాధాన్యతను సంతరించుకొంది. 

ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కేంద్రంతో గొడవపడటం మంచిది కాదని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఏపికి న్యాయం జరిగేవరకు పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. 

గవర్నర్ నరసింహన్ తాను ఒక శ్రేయోభిలాషిగా మాత్రమే ఈ సలహా ఇస్తున్నానని చెప్పినప్పటికీ, అయన కేంద్రప్రభుత్వ ప్రతినిధిగానే వచ్చి సున్నితంగా బాబును హెచ్చరించినట్లు భావించవచ్చు. కానీ చంద్రబాబు తమ వైఖరికే కట్టుబడి ఉంటామని గవర్నర్ నరసింహన్ కు తేల్చిచెప్పినందున రానున్న రోజులలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 

ఇంతకాలం మిత్రపక్షంగా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా ఇప్పుడు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఆందోళనల కారణంగా ఏపిలో భాజపాకు రాజకీయంగా తీవ్రనష్టం జరిగే అవకాశం ఉంది కనుక మోడీ  సర్కార్ తదనుగుణంగా పావులు కదుపవచ్చు. ఏపి సర్కార్ ను కట్టడిచేయడానికి కిరణ్ బేడీ వంటి గవర్నర్ ను నియమిస్తుందేమో?


Related Post