గన్ మ్యాన్లను అలా కూడా వాడుకోవచ్చా?

April 18, 2018


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన నలుగురు గన్ మ్యాన్లను వెనక్కు తిప్పి పంపించేశారు. సరిగ్గా నెలరోజుల క్రితమే పవన్ కళ్యాణ్ అభ్యర్ధన మేరకు ఏపి సర్కార్ ఆయనకు నలుగురు గన్ మ్యాన్లను కేటాయించింది. కానీ పవన్ కళ్యాణ్ ఇటీవల తెదేపాతో స్నేహబంధం తెంచుకొని ఏపి సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అయన కేంద్రం కనుసన్నలలోనే పనిచేస్తున్నారని తెదేపా ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ వ్యూహాలను గన్ మ్యాన్ల ద్వారా తెదేపా సర్కార్ సేకరిస్తున్నట్లు అనుమానం కలుగడంతో, పార్టీ నేతల సూచన మేరకు పవన్ కళ్యాణ్ తన నలుగురు గన్ మ్యాన్లను వెనక్కు తిప్పి పంపేసినట్లు సమాచారం. వారిని తిప్పి పంపడానికి అయన ఎటువంటి కారణమూ పేర్కొనలేదు. 

గన్ మ్యాన్లను వ్యక్తిగత భద్రత కోసమే కేతాయిస్తారనే సంగతి అందరికీ తెలుసు కానీ వారిద్వారా పార్టీలపై గూడచర్యం కూడా చేయవచ్చుననేది సామాన్య ప్రజలకు తెలియని కొత్త విషయమే. గత నాలుగేళ్ళుగా తెదేపా, భాజపాలు ఒకదానినొకటి పొగుడుకొంటూ కాలక్షేపం చేసేసాయి. కానీ వాటికి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ భాజపాకు దూరంగా జరిగి తెదేపాకు దగ్గరైనట్లు కనిపించినప్పటికీ, ఇప్పుడు తెదేపాకు కూడా దూరంగా జరిగింది. దాంతో జనసేన-భాజపా-వైకాపాలు మూడూ కుమ్మక్కయ్యాయని తెదేపా ఆరోపిస్తుండటం చాలా విచిత్రమైన రాజకీయ పరిణామమే. ఇంతకాలం తెదేపా సర్కార్ కు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దానిని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ రంగంలో దిగేవారని గుసగుసలు వినిపించేవి. కానీ ఇప్పుడు తెదేపా-జనసేనలే కత్తులు దూసుకొంటున్నాయి. ఇంతకాలం రాసుకుపూసుకు తిరిగినప్పుడు అందరూ మంచిగానే కనబడ్డారు. కానీ దూరంకాగానే ఎవరూ ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు.


Related Post