కేంద్రప్రభుత్వంపై ఈటల కామెంట్స్

April 18, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చినప్పటి నుంచి కేంద్రంపట్ల తెరాస వైఖరిలో చాలా మార్పు కనబడుతోంది. తెరాస నేతలు ఇదివరకులాగ మెతకవైఖరి ప్రదర్శించకుండా కాస్త కటినంగా మాట్లాడుతున్నారిప్పుడు. నగదు కొరత గురించి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేయగానే, మంత్రి కేటిఆర్ ఆయనకు చురకలు వేయడమే అందుకు మంచి నిదర్శనంగా చెప్పవచ్చు. 

అదే సమయంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ కూడా కేంద్రానికి చురకలు వేశారు. డిల్లీలో నిన్న జరిగిన జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ, “జి.ఎస్.టి.లో ఇంకా అనేక సమస్యలున్నాయి. వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. 15వ ఆర్ధిక సంఘం ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తాము కానీ దానితో రాష్ట్రాల హక్కులు హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోము. 2011 జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తామనడం కూడా సరికాదు. కేంద్రఆదాయంలో రాష్ట్రాలకు న్యాయంగా దక్కవలసిన వాటాలను చెల్లించాల్సిందే. ఈవిషయంలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపితే గట్టిగా వ్యతిరేకిస్తాం. దేశంలో నగదు కొరత విపరీతంగా ఉందని మేము జైట్లీకి చెపితే అయన అటువంటి సమస్యే లేదనడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కోల్పోకుండా జాగ్రత్తపడితే మంచిది. ఆ బాధ్యత కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పైనే ఉంది,” అని ఈటల రాజేందర్ అన్నారు.          



Related Post