సినీపరిశ్రమలో కాస్టింగ్ కౌచింగ్..ఉందా లేదా?

April 18, 2018


img

ప్రపంచానికి భారతీయ సినీపరిశ్రమ సత్తాను చాటి చెప్పినది తెలుగు సినీపరిశ్రమ. అటువంటి గొప్ప సినీపరిశ్రమలో ఉన్న అవలక్షణాలు ఒకటొకటిగా బయటపడుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నలుగురు బడా నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకొని చిన్న సినిమాలు ప్రదర్శించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని సినీపరిశ్రమలో చిన్న నిర్మాతలే దీక్షలు చేసిన సంగతి అందరికీ తెలుసు. ఈ సమస్యపై సాక్షాత్ స్వర్గీయ దాసరి నారాయణ రావు కూడా అనేకసార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 

గత ఏడాది మాదక ద్రవ్యాల వ్యవహారం బయటపడింది. ఇప్పుడు మహిళా నటులపై లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడటంతో అందరూ తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మాదకద్రవ్యాల వ్యవహారం బయటపడినప్పుడు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు అదంతా అబద్దం..గౌరవంగా జీవిస్తున్న తమపై బురదజల్లడం భావ్యమేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జరిగిందేమిటో అందరూ చూశారు. ఆ కేసులను దర్యాప్తు చేసిన సిట్ అధికారులు కొన్నిరోజుల క్రితమే ముగ్గురు సినీ ప్రముఖులపై ఛార్జ్ షీట్స్ దాఖలు చేశారు. అంటే అర్ధం ఏమిటి? 

ఇప్పుడు సినీపరిశ్రమలో మహిళా నటులపై ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు, సినిమాలలో అవకాశాలు కల్పించకపోవడంవంటి అనేక సమస్యలపై వారందరూ ప్రెస్ మీట్స్ పెట్టి తమ గోడును వెళ్ళబోసుకొంటుంటే, సినీ పరిశ్రమలో ‘పెద్దమనుషులు’ ముందుకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పలేకపోతున్నారు! పైగా కొంతమంది వారిదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. 

సినీ పరిశ్రమ అంటే అందరికీ అంత చులకన అయిపోయిందా? అని చిందులు వేస్తున్నారు. తప్పుడు వార్తలు వ్రాసే మీడియాపై, తమపై అభాండాలు వేస్తున్న జూనియర్ ఆర్టిస్టులపై, సామాజిక కార్యకర్తలపై పరువునష్టం దావాలు వేస్తామని హెచ్చరిస్తున్నారు. 

సినీ నిర్మాత జీవిత చేసిన హెచ్చరికలపై సామాజిక కార్యకర్త సంధ్య స్పందిస్తూ, “నేను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలున్నాయి. స్వయంగా భాదిత యువతులే నా దగ్గరకు వచ్చి సినీపరిశ్రమలో వారు ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొన్నారు. వారు నాకు చెప్పిన వాటిలో కొన్ని విషయాలే నేను బయటపెట్టాను. బహిరంగంగా చెప్పుకోలేని అనేక అసహ్యకరమైన విషయాలున్నాయి. నా ఈ పోరాటం జీవితతో చేస్తున్నది కాదు. తెలుగు సినీపరిశ్రమలో నెలకొనున్న క్యాస్టింగ్ కౌచింగ్ కు వ్యతిరేకంగా చేస్తున్నాను. కానీ సినీపరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచింగ్’, ‘కమిట్మెంట్’ వంటి అవలక్షణాలు లేవన్నట్లు జీవిత మాట్లాడటం సరికాదనే ఉద్దేశ్యంతోనే ఆ వ్యాఖ్యలు చేశాను. కానీ ఆమె అది అర్ధం చేసుకోకుండా నాపై కోర్టులో కేసు వేస్తానంటే దానిని ఎదుర్కోవడానికి నేను సిద్దంగానే ఉన్నాను. నా జీవితమంతా మహిళల కోసం పోరాడుతూనే ఉంటాను,” అని అన్నారు. 

సినీపరిశ్రమలో ఈ సమస్య ఉందని, దానిని పరిష్కరించాలని స్వయంగా భాదితులు కోరుతుంటే సినీపరిశ్రమ స్పందించవలసిన తీరు ఇదేనా? సంధ్య వంటి సామాజిక కార్యకర్తలు, ప్రొఫెసర్ కోదండరాం వంటి రాజకీయనేతలు కూడా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడవలసివస్తోంది అని ఆలోచించకుండా, వారిపై కూడా కోర్టులో కేసులు వేస్తామని బెదిరించడం సబబేనా? అని అందరూ ఆలోచించాలి.


Related Post