కాంగ్రెస్ నేతలకు భలే అవకాశం దొరికింది!

April 17, 2018


img

చాలా కాలం తరువాత తెరాస సర్కార్ కాంగ్రెస్ నేతలకు దొరికిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వాలను పునరుద్దరిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో టి-కాంగ్రెస్ నేతలు అందరూ మూకుమ్మడిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. 

హైకోర్టు తీర్పుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ, “చివరికి న్యాయమే గెలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ తను తీసిన గోతిలో తనే పడ్డారు. నేను చేయని తప్పుకు నన్ను శిక్షించాలని ప్రయత్నించడం నాకు చాలా బాధ కలిగించింది. నాకు వ్యతిరేకంగా ఎవరెన్ని కుట్రలు చేసినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు,” అని అన్నారు. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “హైకోర్టు తీర్పు చాలా హర్షణీయం. దానిని మేము స్వాగతిస్తున్నాము. ఈ తీర్పు నిరంకుశపాలన చేస్తున్న తెరాస సర్కార్ కు చెంపదెబ్బ వంటిది. కనుక ఇకనైనా ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగిస్తే మంచిది,” అని అన్నారు.               

సి.ఎల్పి నేత జానారెడ్డి మాట్లాడుతూ, “హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం. ఇది నియంతృత్వానికి, కక్షపూరిత రాజకీయాలకు చెంపపెట్టువంటిది. ఒక రాజకీయపార్టీ బహిరంగ సభ పెట్టుకొంటామంటే తెరాస సర్కార్ దానికీ అనుమతీయలేదు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు (కాంగ్రెస్) లేకుండానే పంచాయితీ రాజ్ చట్టాన్ని ఆమోదించేసింది. ఇటువంటి చర్యలను ఏమనాలి? ప్రజాస్వామ్యమా..నియంతృత్వమా? రేపు ఆ చట్టాన్ని కూడా కోర్టు తిరస్కరించవచ్చు,” అని అన్నారు.    

డికె అరుణ మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెరాస సర్కార్ కు ఇది చెంపదెబ్బ వంటిది. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా అందరూ తమ పదవులకు రాజీనామా చేయాలి. ఉద్యమాలు చేసినందున నా అంతటివాడు లేడని ముఖ్యమంత్రి కెసిఆర్ అనుకొంటున్నారు. అది తప్పని హైకోర్టు తీర్పు రుజువు చేసింది,” అని అన్నారు. 


Related Post