టాలీవుడ్ పరువు తీస్తున్నారు: కోదండరాం

April 17, 2018


img

తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలను నిరసిస్తూ నటి శ్రీరెడ్డి మొదలుపెట్టిన పోరాటం నానాటికీ తీవ్రం అవుతోంది. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా హాజరయ్యి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు మద్రాసులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను స్వర్గీయ చెన్నారెడ్డి, స్వర్గీయ ఎన్టీఆర్ తదితరులు పట్టుబట్టి హైదరాబాద్ కు రప్పిస్తే అది అన్నివిధాల నిలద్రొక్కుకొందని అన్నారు. ప్రభుత్వ సహాయంతోనే సినీ పరిశ్రమ ఇక్కడకు వచ్చి స్థిరపడినప్పుడు, దానిలో తప్పనిసరిగా స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు ప్రభుత్వం, సినీ పరిశ్రమలోని పెద్దలు కూడా కలుగజేసుకొని పరిష్కరించాలన్నారు. సినీ పరిశ్రమ లో కనిపిస్తున్న ఈ అవలక్షణాలు, విచ్చలవిడితనం హద్దులులేకుండా పెరిగిపోతోందని, దానిని ప్రభుత్వం నియంత్రించవలసిన అవసరం ఉందన్నారు. సినీ పరిశ్రమలో దళారీ వ్యవస్థను అరికట్టడానికి ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సినిమాలలో నటించాలని వస్తున్న స్త్రీల పట్ల ఈవిధంగా అనుచితంగా వ్యవహరించడం తగదని అన్నారు. జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులకు తమ పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.                



Related Post