ధర్డ్ ఫ్రంట్ సన్నాహాలలో సిఎం కెసిఆర్ బిజీ?

April 17, 2018


img

ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవగౌడలతో చర్చించిన ముఖ్యమంత్రి కెసిఆర్, వచ్చే నెల మొదటి వారంలో భువనేశ్వర్ వెళ్ళి ఒడిశా ముఖ్యమంత్రి  నవీన్ పట్నాయిక్ ను కలువబోతున్నారు. ఈలోగా ఇక్కడ తెరాస ప్లీనరీ సమావేశాలు, అక్కడ ఒడిశా అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తవుతాయి కనుక ధర్డ్ ఫ్రంట్ గురించి చర్చించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులకు తగినంత సమయం లభిస్తుంది. 

ధర్డ్ ఫ్రంట్ ఇంకా ఏర్పాటు చేయకపోయినా, ఆ ప్రయత్నంలో భాగంగా కెసిఆర్-దేవగౌడ మద్య బెంగళూరులో జరిగిన చర్చల తరువాత, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో దేవగౌడ్ కు చెందిన జెడిఎస్ పార్టీకి కెసిఆర్, అసదుద్దీన్ ఒవైసీల మద్దతు లభిస్తోంది. జెడిఎస్ ఆహ్వానిస్తే దాని తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని వారిరువురూ చెప్పారు. 

కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఆలోచన చేసి ఉండకపోతే బెంగళూరు వెళ్ళి ఉండేవారు కాదు. జెడిఎస్ కు వారిరువురి మద్దతు లభించి ఉండేది కాదు. కనుక ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపి పరస్పరం సహకరించుకోగలిగితే అది ధర్డ్ ఫ్రంట్ కు బలమైన పునాది కాగలదని స్పష్టమవుతోంది. 

ఓడిశాలో నవీన్ పట్నాయక్ కు చెందిన బిజు జనతాదళ్ (బిజెడి) కాంగ్రెస్, భాజపాలతో సమాన దూరం పాటిస్తోంది. తెలంగాణాలో తెరాస మాదిరిగానే ఓడిశాలో బిజెడి కూడా ఆ రెండు జాతీయపార్టీలతో నిరంతరం రాజకీయ పోరాటాలు చేస్తోంది. వాటిని ఎదుర్కోవడానికే కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు కనుక బిజెడి కూడా ధర్డ్ ఫ్రంట్ లో భాగస్వామి అయ్యేందుకు అంగీకరించవచ్చు.   


Related Post