నాగం తొందరపడ్డారా?

April 14, 2018


img

ఒకప్పుడు తెదేపా హయంలో ఒకవెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి, తెదేపాకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసినప్పటి నుంచి నేటి వరకు అయనను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. తెరాసలో చేరాలని తెదేపాకు గుడ్ బై చెపితే కనీసం టిజెఏసిలో చేరేందుకు కూడా అవకాశం లభించలేదు. భాజపాలో చేరినా ఆయనకు కలిసిరాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరుదామనుకొని భాజపాకు గుడ్ బై చెప్పేశారు. కానీ ఊహించనివిధంగా ఆ పార్టీలోను వ్యతిరేకత ఎదురవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తునారు. గద్వాల్ ఎమ్మెల్యే డికె అరుణ, ఎంపి నంది ఎల్లయ్య, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యి నాగం జనార్ధన్ రెడ్డి రాకను గట్టిగా అడ్డుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే మరోసారి డికె అరుణ నేతృత్వంలో కొందరు నేతలు డిల్లీ వెళ్ళి నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చజెప్పాలని నిర్ణయించారు. 

తామంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి రప్పించడానికి జైపాల్ రెడ్డి ప్రయత్నించడాన్ని వారు తప్పు పట్టారు. ఇంతవరకు మహబూబ్ నగర్ జిల్లాలో చాలా బలంగా, సంఘటితంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో జైపాల్ రెడ్డి చిచ్చు పెట్టి బలహీనపరుస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయబోతున్నానని ఏవిధంగా ప్రకటించుకొన్నారని వారు మండిపడ్డారు. జైపాల్ రెడ్డి అండదండలు చూసుకొనే అయన ఆవిధంగా ప్రకటించుకొని ఉంటారని వారు అభిప్రాయపడ్డారు. 

నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొని భాజపాకు గుడ్ బై చెప్పేశారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని నాగంకు తెలియదనుకోలేము. తెలిసీ అయన భాజపాకు గుడ్ బై చెప్పేసి తొందరపడ్డారేమో అని అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీలుపడకపోతే నాగంపరిస్థితి ఏమిటి? అయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇస్తే తాము ఆయనకు సహకరించబోమని ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. కనుక ఒకవేళ పార్టీలో చేరినా జిల్లా నేతల నుండి ఇంత వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు దానిని ఏవిధంగా తట్టుకొని నిలబడగలరు? 2019 ఎన్నికలే తన చివరి ఎన్నికలని ఆ తరువాత పోటీ చేయనని చెపుతున్న నాగం జనార్ధన్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే ఏ పార్టీలో చేరుతారో చూడాలి.


Related Post