ఆ వాదనలు సరికాదు: ప్రొఫెసర్ కోదండరాం

April 13, 2018


img

వచ్చే ఎన్నికలలో తెలంగాణా జన సమితి (టిజెఎస్) బరిలోకి దిగడం వలన తెరాస వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెరాసకే లబ్ది కలుగుతుందని, కనుక తెరాసను నిజంగా గద్దె దించాలని ప్రొఫెసర్ కోదండరాం అనుకొంటే తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. 

ఇవ్వాళ్ళ ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ప్రొఫెసర్ కోదండరాం ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే ప్రశ్న అడుగగా, వారి వాదనలు అర్ధరహితమని అయన కొట్టిపడేశారు.

“ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేవి ఎక్కడా కుప్పపోసినట్లు ఉండవు చీలిపోవడానికి...పంచుకోవడానికి! పార్టీల తీరుతెన్నులు, ఎన్నికల సమయంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టే ఓటింగ్ సరళి ఉంటుంది. కనుక టిజెఎస్ వలన తెరాస వ్యతిరేక ఓట్లు చీలిపోతాయనే వాదన అర్ధరహితం. ఇక ఈ కారణం చేత మేము విధిగా ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని చెప్పడం కూడా సరికాదు. వచ్చే ఎన్నికలలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాము,” అని అన్నారు.

వచ్చే ఎన్నికలలో 119 స్థానాలలో పోటీ చేస్తామని ప్రొఫెసర్ కోదండరాం చెపుతున్నారు. కానీ “టిజెఎస్ లో అంతమంది అభ్యర్దులున్నారా? టిజెఎస్ లో కోదండరాం తప్ప మిగిలినవారు తెలంగాణా ప్రజలకు పెద్దగా పరిచయం లేదు గనుక టిజెఎస్ ను ప్రజలు ఆదరిస్తారా? బలమైన కాంగ్రెస్, తెరాసలను డ్డీకొని టిజెఎస్ విజయం సాధించగలదనే నమ్మకం ఉందా?” అనే ప్రశ్నలకు సమాధానం చెపుతూ, “తెలంగాణా ఉద్యమాలతో సంబంధం లేనివారు పారాచూట్ పట్టుకొని దిగినట్లు నేరుగా మంత్రి కుర్చీలలో దిగిపోగా, తెలంగాణా సాధన కోసం పోరాడినవారు తెరాసలో పక్కకు పెట్టబడ్డారు. అటువంటి ఉద్యమకారులు అనేకమంది మా పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మా పార్టీ అభిప్రాయలు, ఆశయాలతో ఏకీభవిస్తున్నవారు మా పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. కనుక మా పార్టీలో అభ్యర్ధులకు కరువేమీ లేదు. అలాగే టిజెఎస్ తరపున పోటీ చేసేవారు తప్పకుండా గెలుస్తారనే నమ్మకం మాకుంది. ఇక కాంగ్రెస్, తెరాసలు ఎంత బలమైనవి అయినప్పటికీ, వాటికి నిజంగా ప్రజాధారణ ఉందా లేదా అనేదే ముఖ్యం. డిల్లీలో కొత్తగా స్థాపించబడిన ఆమాద్మీ పార్టీ కాంగ్రెస్, భాజపాలను డ్డీ కొని గెలవలేదా? అలాగే ఇక్కడ కూడా మేము విజయం సాధించగలమని గట్టిగా నుమ్మ్తున్నాను,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 


Related Post