కెసిఆర్-దేవగౌడ సమావేశంలో ప్రకాష్ రాజ్!

April 13, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవ్వాళ్ళ బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవగౌడతో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు ఎంపిలు వినోద్, సంతోష్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరవడం విశేషం. కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించేందుకే బెంగళూరు వెళ్ళి దేవగౌడని కలిసారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ రాజకీయాలతో సంబంధంలేని ప్రకాష్ రాజ్ ఈ సమావేశంలో ఎందుకు హాజరయ్యారనేదే అసలైన ప్రశ్న. 

భాజపా పట్ల వ్యతిరేకతను అయన ఎన్నడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. అయన ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశత్వాన్ని, భాజపా మతతత్వాన్ని నిరసిస్తూ అనేకసార్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కనుక వచ్చే ఎన్నికలలో భాజపాను ఓడించేందుకు ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలని అయన భావిస్తే అసహజమేమీ కాదు. బహుశః ఆ ప్రయత్నంలోనే అయన హైదరాబాద్ వచ్చి కెసిఆర్ ను కలిసి ఉండవచ్చు. మళ్ళీ ఈ సమావేశానికి కూడా హాజరయ్యారని భావించవచ్చు.

మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో ఎలాగైనా గెలిచి దక్షిణాదిన మళ్ళీ పట్టు సాధించాలని భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కనుక దానిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు ఇదే సరైన అవకాశమని ప్రకాష్ రాజ్ భావిస్తూ దేవగౌడకు మద్దతు పలికేందుకు సిద్దపడుతున్నా ఆశ్చర్యం లేదు. ప్రకాష్ రాజ్ కు దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కారణంగా అన్ని రాష్ట్రాల రాజకీయ నేతలకు అయన చిరపరిచితుడే. కనుక అయన కూడా పూనుకొంటే ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమే. 


Related Post