శ్రీరెడ్డిపై నిషేధం ఎందుకు ఎత్తివేసారో...

April 13, 2018


img

నటి శ్రీరెడ్డిపై విధించిన నిషేధం ఎత్తివేసి ఆమెకు సినిమాలలో అవకాశాలు కల్పించడానికి అన్ని విధాల సహకరిస్తామని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా చెప్పారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను అరికట్టేందుకు, 20మందితో కూడిన ‘కమిటీ ఎగెనెస్ట్ సెక్సువల్ హెరాస్ మెంట్ (క్యాష్)’ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆమెకు ‘మా’ సభ్యత్వంపై త్వరలో నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. ఆమె ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలపడం వలననే తాము కూడా ఆవేశపడి ఆమెపై నిషేధం విదించామని, కానీ తరువాత పునరాలోచించుకొని తమ నిర్ణయాన్ని ఉపసహరించుకొన్నామని శివాజీ రాజా చెప్పారు.

అయితే కేవలం నాలుగు రోజులలోనే శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేయడానికి ‘మా’ సభ్యులు చెపుతున్న కారణం ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు జరగడంలేదని వాదిస్తూనే మళ్ళీ వాటిని అడ్డుకొనేందుకు ‘క్యాష్ కమిటీ’ని ఏర్పాటు చేయడమే సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. 

అయితే ‘మా’ సభ్యులు ఇంత అకస్మాత్తుగా, హడావుడిగా మీడియా సమావేశం పెట్టి శ్రీరెడ్డిపై నిషేధం ఎందుకు ఎత్తివేస్తున్నట్లు ఎందుకు ప్రకటించవలసి వచ్చింది?ఆమెకు సినిమాలలో నటించేందుకు అవకాశాలు కల్పిస్తామని ఎందుకు హామీ ఇవ్వవలసి వచ్చింది? ఒక నటి...అందునా తెలుగునటి అయిన ఆమెకు ఇంతకాలం ‘మా’లో ఎందుకు సభ్యత్వం కల్పించలేదు? ఆమె ఫిలింఛాంబర్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపే వరకు ఎందుకు పట్టించుకోలేదు? ‘మా’లో సభ్యత్వం కల్పిస్తామని ఇప్పుడు ఎందుకు హామీ ఇస్తున్నారు? అనే ప్రశ్నలకు ‘మా’ సమాధానాలు చెప్పలేదు. 

ఫిలింఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలపడాన్ని ఎవరూ సమర్ధించరు. చివరికి ఆమె తల్లి కూడా సమర్ధించలేదు. కానీ అప్పటి నుంచే ఆమె చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి క్రమంగా మద్దతు లభించడం మొదలైంది. టీవీ స్టూడియోలలో ఆమె ఇంటర్వ్యూలతో అది మరింత హైలైట్ అయ్యింది. 

తనపై సినీ పరిశ్రమలో అనేకమంది ప్రముఖులు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని, కొందరు తనను వాడుకొన్నారని ఆమె నిర్భయంగా ఆరోపించింది. అయితే ఆమె నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదు. తన ఆరోపణలకు సాక్ష్యాలను కూడా మీడియాకు విడుదల చేయడం మొదలుపెట్టింది. ఆమెపై సినీ పరిశ్రమలో ఇంకా ఎంతమంది ప్రముఖులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారో ఆమెకు, వారికే తెలియాలి. 

ఆమె తన వద్ద ఉన్న ఆ సాక్ష్యాధారాలను అన్నిటినీ బయటపెట్టినట్లయితే తమ పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయని, తమ కుటుంబాలలో అల్లకల్లోలం మొదలవుతుందనే భయంతోనే ఇంత హడావుడిగా ‘మా’ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి, శ్రీరెడ్డిని ‘కూల్’ చేసే ప్రయత్నం చేసినట్లు భావించవచ్చు. అందుకే వారి సమావేశాన్ని లైవ్ లో చూసిన ఆమె స్టూడియోలోనే పకపక నవ్వింది. 

ఇదివరకు సినీ పరిశ్రమలో మత్తుమందులు వ్యవహారం బయటపడినప్పుడు అటువంటిదేమీ లేదని సినీ ప్రముఖులు బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో అందరూ కళ్ళారా చూశారు. ఉద్యోగాలు చేసుకొనే మహిళలపైనే అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నప్పుడు, అందాల ప్రదర్శనలకు నిలయమైన సినీ పరిశ్రమ మడికట్టుకొని కూర్చోంటుందని ‘మా’ సభ్యులు సర్టిఫై చేస్తే నమ్మశక్యంగా ఉందా? 

శ్రీరెడ్డి తన పోరాటానికి ఎంచుకొన్న దారి సరైనది కాకపోవచ్చు కానీ ఆమె చేస్తున్న పోరాటం మాత్రం సరైనదే. అది ఆమె ఒక్కరి పోరాటమే కాదు. సినీ పరిశ్రమలో మహిళలందరిది. అందుకే ఆమెకు అందరూ మద్దతు పలకడం మొదలుపెట్టారు.


Related Post