అందుకే బస్సు యాత్రలు: జూపల్లి

April 13, 2018


img

మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో మహ్మదాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోనే తెరాస ఆవిర్భవించింది. అందరి సహకారంతో అది చేసిన పోరాటాల వలన తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి తెలంగాణా అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక ప్రణాళికలు రచిస్తూ వాటిని చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. వ్యవసాయం, సాగు, త్రాగునీరు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నాము. ప్రజలకు స్వచ్చమైన త్రాగునీరు అందించడానికి మిషన్ భగీరథ పధకంలో భాగంగా 2 లక్షల కిమీ పొడవునా పైప్ లైన్లు వేశాము. ఒకేసారి అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నాము. వేలాది చెరువుల పూడిక తీయించి వాటిని మంచి నీటితో నింపుతున్నాము. రైతులకు పంట పెట్టుబడిగా ఎకరానికి రూ.4,000 చొప్పున అందించబోతున్నాము. ఇంకా అనేకానేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమానంగా అభివృద్ధి చేస్తున్నాము. 

గత కాంగ్రెస్ పాలనలో ఎన్నడూ చూడలేని విధంగా ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇన్నేళ్ళుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బస్సు యాత్రలు చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాము..ఇది చేస్తాము.. అంటూ ఏవేవో హామీలు గుప్పిస్తున్నారు. నిజానికి వారు అధికారం చేజిక్కించుకోవడం కోసమే బస్సు యాత్రలు చేస్తున్నారు తప్ప ప్రజాసమస్యలు, ప్రజాసంక్షేమం పట్ల వారికి ఏమాత్రం ఆసక్తి లేదు,” అని అన్నారు.

కాంగ్రెస్ హయంలో తెలంగాణా తీవ్ర నిరాధారణకు, వివక్షకు గురైన మాట అక్షరాల నిజం. కాంగ్రెస్ హయంలోనే తెలంగాణాను ఇంతగా అభివృద్ధి చేసి ఉండి ఉంటే తెలంగాణా రాష్ట్రం డిమాండ్ వచ్చేది కాదూ..కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మళ్ళీ అధికారం కట్టబెట్టి ఉండేవారు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని తెలంగాణా ప్రజలు భావించినందునే, తెలంగాణా ఇచ్చినప్పటికీ దానిని 2014 ఎన్నికలలో తిరస్కరించారు. ఆ ఎన్నికలలో తెరాస విజయానికి, కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయి. కానీ ఇదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. 

ఇక కాంగ్రెస్, తెరాసలతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారం రావడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంటుయాని అందరికీ తెలుసు. కనుక కాంగ్రెస్ కూడా మళ్ళీ అధికారం రావడమే లక్ష్యంగా బస్సు యాత్రలు చేస్తోందని వేరే చెప్పక్కరలేదు. ఆ విషయం వారే స్వయంగా చెప్పుకొంటున్నారు కూడా. కనుక ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ తప్పు పట్టడానికి లేదు. 

తెరాస అధికారంలో ఉంది కనుక సంక్షేమ పధకాలు ప్రకటించి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఆ అవకాశం లేని కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు చేస్తూ హామీలు గుప్పిస్తోంది అంతే. రెండింటి లక్ష్యం వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకోవడమే. కానీ జూపల్లి చెప్పినట్లు ఆ రెండు పార్టీలలో దేని హయంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందనే విషయం 2019 ఎన్నికలలో ప్రజలే నిర్ణయిస్తారు. 


Related Post