కెసిఆర్ రేపు బెంగళూరు పర్యటన!

April 12, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ స్థాపన కోసం కోల్ కతా వెళ్ళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి మాట్లాడివచ్చిన తరువాత మళ్ళీ ఆ ప్రస్తావన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా భాజపాయేతర పార్టీలను కూడగట్టి మహాకూటమి ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టడంతో కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ధర్డ్ ఫ్రంట్ కు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడినట్లయ్యాయి. కానీ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేస్తూ, రేపు ఆయన బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవగౌడతో సమావేశం కాబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళి దేవగౌడతో చర్చించి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకొంటారు. 

కొన్ని రోజుల క్రితమే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కెసిఆర్ తో అసెంబ్లీలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. అయన అంత అకస్మాత్తుగా వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎందుకు కలిసారో ఇద్దరూ చెప్పలేదు. కానీ రేపు కెసిఆర్ బెంగళూరు బయలుదేరుతుండటంతో వారి సమావేశానికి, దీనికీ ఏమైనా సంబంధం ఉందా?అనే సందేహం కలుగుతోంది. 

మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు కెసిఆర్ బెంగళూరు వెళ్ళి దేవగౌడను కలుస్తున్నారు. కనుక కర్ణాటక ఎన్నికలలో దేవగౌడకు చెందిన జనతా దళ్ (సెక్యులర్) పార్టీకి ఏమైనా సహకరించబోతున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ, కెసిఆర్ పర్యటనలో ‘ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు’ ప్రధాన ఎజెండా అని భావించవచ్చు. 


Related Post