రెండు రాష్ట్రాలలో భాజపా పరిస్థితి ఏమిటి?

April 12, 2018


img

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పార్టీల హడావుడి చూస్తుంటే అప్పుడే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిందా? అని అనుమానం కలుగుతోంది. ఏపిలో ప్రత్యేకహోదా, విభజన హక్కుల పేరు చెప్పుకొని అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి అందరూ చూస్తూనే ఉన్నారు. ఏపిలో పార్టీలకు రాజకీయంగా ప్రత్యర్ధిపై పైచెయ్యి సాధించాలనే తాపత్రయమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం ఆసక్తిలేదని వాటి ఎత్తులు, ఎన్నికల హామీలు, హడావుడి స్పష్టం చేస్తున్నాయి. 

ఇక తెలంగాణాలో అధికార తెరాస సంక్షేమ కార్యక్రమాల స్పీడు పెంచి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బస్సుయాత్రలతో ప్రజల మధ్యకు వెళ్ళి అప్పుడే ఎన్నికల హామీలు గుప్పిస్తోంది. మరోపక్క తెలంగాణా జనసమితి (టిజెఎస్), బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) దూసుకు వస్తున్నాయి. వాటిలో బిఎల్ఎఫ్ తరచూ సభలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ చాలా హడావుడి చేస్తోంది. 

విశేషమేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా, భాజపాలు కటీఫ్ చెప్పుకొని విడిపోవడం వలన ఒంటరిగా మిగిలిపోయాయి. ఒకప్పుడు తెలంగాణాలో ఒకవెలుగు వెలిగిన తెదేపా, భాజపాలు ఇప్పుడు మిగిలిన పార్టీల కంటే చాలా వెనుకబడిపోయాయి. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాలపట్ల కేంద్రం చాలా నిర్లక్ష్యవైఖరితో వ్యవహరిస్తుంనందున భాజపా పట్ల తెలుగు ప్రజలలో వ్యతిరేకత పెరిగినట్లు కనబడుతోంది. ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీపై, భాజపాపై కత్తి కట్టినట్లు వ్యవహరిస్తుండటంతో ఏపిలో భాజపా నేతలు బయట తిరుగలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' ప్రకటన చేసి భాజపా గాలి తీసేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో పోటీ ప్రధానంగా తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని స్పష్టమైంది. కనుక రేడు తెలుగు రాష్ట్రాలలో భాజపా పరిస్థితి అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. ఎన్నికల సమయానికి ఏమైనా మెరుగుపడుతుందేమో చూడాలి.


Related Post