ఎందుకీ నిరాహారదీక్షలు?

April 12, 2018


img

పార్లమెంటులో ప్రతిపక్షాలు సభ్యుల అనుచిత వైఖరిని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, భాజపా కేంద్రమంత్రులు, భాజపా ఎంపిలు, దేశవ్యాప్తంగా భాజపా నేతలు అందరూ నేడు ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్నారు. కీలకమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ పై చర్చించకుండా సభలో రభస చేయడం తప్పే. ప్రతిపక్షాలలో కొన్ని పార్టీల సభ్యులు సభలో రభస చేస్తున్నప్పుడు వారు లేవనెత్తుతున్న సమస్యపై చర్చించి లేదా వారిని బయటకు పంపించి సభను కొనసాగించవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉంది. కానీ ప్రతిపక్షాలు సభలో రాద్దాంతం చేస్తుంటే సభ ఆర్డర్ లో లేదనే సాకుతో రోజూ సభను వాయిదావేస్తూ కాలక్షేపం చేసేసింది. కనుక జరిగిన తప్పులో ప్రతిపక్షాలది ఎంత తప్పు ఉందో కేంద్రప్రభుత్వానిది అంతే ఉంది. కానీ తప్పంతా ప్రతిపక్షాలదే అన్నట్లుగా భాజపా నేతలు నిరాహార దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. 

ఒకవేళ ప్రతిపక్షాలు చేసింది తప్పయితే గతంలో భాజపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే తప్పు చాలాసార్లు చేసింది. అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తే తప్పు ఎలా అవుతుంది?

రిజర్వేషన్ల అంశంపై తెరాస ఎంపిలు, ఏపికి ప్రత్యేకహోదా కావాలని తెదేపా, వైకాపా, కాంగ్రెస్ ఎంపిలు, అలాగే కావేరీ బోర్డు ఏర్పాటు చేయవలసిందిగా అన్నాడిఎంకె ఎంపిలు పార్లమెంటులో కేంద్రాన్ని కోరినప్పుడు వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మోడీ సర్కార్ పై ఉంది. కానీ వారికి సమాధానం చెప్పలేదు. ఆ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు మొదలయ్యాయి. అయినా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడం లేదు. ఈ ఆందోళనలను చూడనట్లుగా నటిస్తున్నారు. 

దేశంలో ఇటువంటి సమస్యలు లేదా పరిస్థితులు తలెత్తినప్పుడు శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పక మునుపే వెంటనే సంబంధిత వర్గాలతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించి మళ్ళీ శాంతి నెలకొల్పడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ పని చేయకుండా ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు, భాజపా ఎంపిలు, నేతలు నిరాహార దీక్షలు చేయడాన్ని ఏమనుకోవాలి? వివిధ రాష్ట్రాల సమస్యలు పరిష్కరించకుండా ఆ సమస్యలు లేవనెత్తి చూపుతున్నవారిదే తప్పు అని దేశ ప్రధానమంత్రి నిరాహారదీక్ష చేయడం సబబేనా?దేశ సమగ్రతకు, జాతీయవాదానికి భంగంకలిగే పరిస్థితులు నెలకొని ఉన్నా, భాజపా రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచించడాన్ని ఏమనాలి? భాజపా నేతల నిరాహారదీక్షలతో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? 


Related Post