ఆ మాట కెసిఆరే స్వయంగా చెప్పారు కదా?

April 11, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్ లో పార్టీ కార్యకర్త వివాహానికి హాజరయ్యారు. అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ, రైతుబంధు పధకం క్రింద ఎకరాకు రూ.4,000 పంట పెట్టుబడిగా అందించడం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నదే. నాలుగేళ్ళు రైతులను పట్టించుకోకుండా వ్యవహరించిన కెసిఆర్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఇప్పుడు వారిని మంచి చేసుకొనే ప్రయత్నంలో ఈ పధకం అమలుచేస్తున్నారు. అయితే కెసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వచ్చే ఎన్నికలలో రైతులు తెరాసను ఓడించడం ఖాయం. రాష్ట్రంలో తెరాసకు వ్యతిరేకంగా నిశబ్ద విప్లవం వస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

తెరాస సర్కార్, మోడీ సర్కార్ తో సహా దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలను ప్రసన్నం చేసుకొని ఓట్లు రాబట్టుకోనేందుకే సంక్షేమ పధకాలు అమలుచేస్తుంటాయని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా శాసనసభలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతే కాదు..తెలంగాణా రైతు సమన్వయ సమితిల ఏర్పాటు వెనుక అదే ఉద్దేశ్యం ఉందని నిర్మొహమాటంగా చెప్పారు. రైతు సమితులలో తెరాస వాళ్ళుంటేనే తమ పధకాలను సమర్ధంగా అమలుచేయగలమని చెప్పారు. వాటిద్వారానే రైతులకు ప్రభుత్వం పంటపెట్టుబడి చెక్కులు పంపిణీ చేయబోతోంది. అంటే రైతులను ప్రసన్నం చేసుకొని వారి ఓట్లను దక్కించుకొనేందుకే ఈ ఏర్పాట్లు, పధకం అని ముఖ్యమంత్రి కెసిఆరే స్వయంగా చెపుతున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ దానిని కొత్తగా కనిపెట్టినట్లు చెప్పనవసరం లేదు కదా! వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారం అప్పగిస్తే, రైతులకు రూ.2 లక్షల పంటరుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని, నెలకు రూ.2,000 నిరుద్యోగ భ్రుతి ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుప్పిస్తున్న హామీలు కూడా ఆ కోవకు చెందినవే కదా? మరి కంబళిపై కూర్చొని అన్నం తింటూ మళ్ళీ వెంట్రుకలు ఏరడం దేనికి? 


Related Post