నా చావుకు మోడీయే కారణం: రైతు

April 11, 2018


img

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో...మళ్ళీ దానిలో యవత్మల్ జిల్లాలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసుకొంటుంటారు. దశాబ్దాలుగా దేశాన్ని ఆ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, భాజపాల లోపభూయిష్టమైన వ్యవసాయ విధానాలు, వ్యవసాయ రంగంపట్ల అలసత్వం, రాష్ట్రంలో వ్యవసాయం, మార్కెటింగ్ రంగాలు కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కుకుపోవడం, దుర్భిక్ష పరిస్థితులు వంటివన్నీ దీనికి ప్రధానకారణాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్రలో..కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉంది. మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కారి, సురేష్ ప్రభు వంటి అనేకమంది సీనియర్ మంత్రులు మోడీ క్యాబినెట్ లో ఉన్నారు. అయినప్పటికీ మహారాష్ట్ర రైతుల దయనీయ పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు.

ఆ కారణంగా ఆర్ధికసమస్యలు భరించలేక నిత్యం అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం యావత్మల్ జిల్లాకు చెందిన శంకర్ బాబురావు ఛాయ్రే (50) పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను వ్రాసిన సూసైడ్ నోట్ లో ‘తన చావుకు మోడీ సర్కార్ అనుసరిస్తున్న తప్పుడు వ్యవసాయవిధానాలే కారణమని’ వ్రాశాడు. అంతే తన చావుకు పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీయే కారకుడని ఆరోపించినట్లే చెప్పవచ్చు. అతను కేవలం లక్ష రూపాయలు అప్పు తీర్చలేక, అప్పులవాళ్ళ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడు. అంటే అతని ప్రాణం ఖరీదు లక్ష కంటే తక్కువన్నమాట! 

భాజపా పాలిత మహారాష్ట్రలో నిత్యం అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకోని మోడీ సర్కార్, భాజపాకు ఓటేస్తే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పుకొంటోంది. యూపి, మహారాష్ట్రలలో దానిపాలన చూస్తున్నవారు భాజపాకు ఎందుకు ఓటేయాలి?అని ప్రశ్నిస్తే భాజపా ఏమి సమాధానం చెపుతుందో? 


Related Post