తెలంగాణా జనసమితి (టిజెఎస్) అవిర్భావసభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఊహించినట్లుగానే టిజెఎస్ హైకోర్టును ఆశ్రయించింది. టిజెఎస్ పిటిషన్ పై హైకోర్టు నిన్న విచారణ జరిపినప్పుడు ఆ పార్టీ తరపున ప్రాముఖ్య న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు.
ప్రొఫెసర్ కోదండరాం ఎప్పుడు, ఎక్కడ బహిరంగసభ జరుపుకోవాలనుకొన్నా పోలీసులు అనుమతించడం లేదని ఆమె పిర్యాదు చేశారు. అప్పుడు తాము కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆదేశాల మేరకు తెరాస సర్కార్ ఆఖరి నిమిషం వరకు కాలయాపన చేసి అనుమతి మంజూరు చేస్తుండటం పరిపాటిగా మారిపోయిందని వాదించారు. తాము పోలీస్ శాఖ సూచనల మేరకు నిర్దిష్ట సమయంలో వారు అనుమతించిన ప్రదేశంలోనే బహిరంగ సభ జరుపుకొంటామని లిఖితపూర్వకంగా తెలియజేసినా ఎప్పుడూ ఇదేవిధంగా జరుగుతోందని ఆమె న్యాయస్థానానికి తెలియజేశారు. ఎల్బి స్టేడియంలో సినిమా కార్యక్రమాలకు, ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవాలకు ఇతర కార్యక్రమాలకు పోలీసులు అనుమతిస్తున్నారు కానీ తాము కోరితే మాత్రం ఏవో కుంటిసాకులు చెప్పి అనుమతించడం లేదని ఆమె పిర్యాదు చేశారు. బహిరంగ సభ జరుపుకోవాలంటే ప్రతీసారి హైకోర్టును ఆశ్రయించక తప్పడం లేదన్నారు. ఆమె వాదనలు విన్న జస్టిస్ట్ ఎం. సీతారాంమూర్తి ఈ వ్యవహారంపై ప్రభుత్వ, పోలీస్ శాఖ వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ కేసును ఏప్రిల్ 16కు వాయిదా వేశారు.
ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ఎత్తివేసిన తరువాత సభలు, నిరసన కార్యక్రమాలు అన్నీ నగర శివార్లలో గల సరూర్ నగర్ మైదానంలో జరుపుకోవచ్చని నగర పోలీస్ కమీషనర్ ప్రకటించారు. కానీ అక్కడ కూడా టిజెఎస్ బహిరంగ సభ జరుపుకోవడానికి అనుమతించడం లేదు. అందుకే టిజెఎస్ కు హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం లేదు.