కాళేశ్వరం! నభూతో..నభవిష్యతి: కేంద్రం

April 10, 2018


img

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్రజలవనరుల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ దేశంలో ఇంత వేగంగా నిర్మితమవుతున్నటువంటి గొప్ప ప్రాజెక్టు మరొకటి చూడలేదని మెచ్చుకొన్నారు. మంత్రి హరీష్ రావు ఆయనకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో  మహాదేవ పూర్ మండల పరిధిలో నిర్మితమవుతున్న మేదిగడ్డ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంపు హౌస్ వగైరాలను చూపించి అక్కడ జరుగుతున్న పనులు, అవి జరుగుతున్న తీరు గురించి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే దీక్షతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు అందరూ రేయింబవళ్ళు పనిచేస్తున్నారని తెలిపారు. 

క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించిన మసూద్ హుస్సేన్ శరవేగంగా జరుగుతున్న ఆ పనులను ఫోటోలు, వీడియో రికార్డ్ చేయవలసిందిగా మంత్రి హరీష్ రావును కోరారు. తద్వారా అటువంటి బారీ ప్రాజెక్టులను ఏవిధంగా ప్రణాళికాబద్దంగా, చురుకుగా పూర్తి చేయవచ్చునో అందరికీ తెలుస్తుందని అన్నారు.  కాళేశ్వరంలో పనులు జరుగుతున్న తీరును అధ్యయనం చేసేందుకుత్వరలోనే తాను జలవనరుల సంఘంలో సభ్యులందరినీ పంపిస్తానని చెప్పారు. ఈ ప్రాజెక్టు, దాని నిర్మాణశైలి దేశంలో అన్ని ప్రాజెక్టులకు ఆదర్శంగా నిలువబోతోందని అన్నారు. ఇది భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప ప్రాజెక్టు అని మసూద్ హుస్సేన్ మెచ్చుకొన్నారు.

ప్రాజెక్టులలో అవినీతి జరిగితే ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తప్పు లేదు. కానీ రాజకీయ కారణాలతో ఇటువంటి పెద్ద ప్రాజెక్టును వ్యతిరేకించడమే అవివేకం. ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలన్నిటికీ కేంద్రజలవనరుల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ అన్న ఈ మాటలే సమాధానం చెపుతున్నాయి. 



Related Post