తెలంగాణాకు కోదండరాం అవసరం లేదు: సుమన్

April 10, 2018


img

కొంత కాలం క్రితం ‘టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టి తమను రాజకీయంగా ఎదుర్కోవాలని’ సవాళ్ళు విసిరింది తెరాస నేతలే. వారే ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతుండటం విశేషం. తెరాస ఎంపి బాల్క సుమన్ తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకని ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా అభివృద్ధిని ప్రశ్నించే అయన వంటి వ్యక్తులు రాష్ట్రానికి అవసరం లేదు,” అని అన్నారు. 

తెలంగాణా రాష్ట్రానికి ఏది అవసరమో, ఎవరు అవసరమో తేల్చవలసినది రాష్ట్ర ప్రజలే తప్ప తెరాస నేతలు కాదని బాల్కా సుమన్ వంటి నేతలు గుర్తుంచుకోవాలి. తెరాసను వ్యతిరేకించినవారందరూ తెలంగాణా ద్రోహులే...కనుక రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని భావించడం నిరంకుశత్వానికి నిదర్శనమవుతుంది. 

‘రాష్ట్ర ప్రజలందరూ తెరాసవైపే ఉన్నారని తెరాస నేతలు చెప్పుకొంటారు. వచ్చే ఎన్నికలలో తెరాసకు 106-108 సీట్లు గెలుచుకోవడం ఖాయమని లేకుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని సవాళ్ళు కూడా విసురుతుంటారు. రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు, కూటములు పుట్టుకొచ్చినా మాకేమీ భయం లేదు...వాటివలన మాకేమీ నష్టం ఉండదని తెరాస నేతలు పదేపదే బల్లగుద్ది చెపుతుంటారు. మరి కోదండరాం తన తెలంగాణా జనసమితి (టిజెఎస్) ఆవిర్భావసభ జరుపుకోవడానికి తెరాస సర్కార్ అనుమతించదు? హైదరాబాద్ లో సభ నిర్వహిస్తే సభకు వచ్చే వాహనాల వలన ధ్వని, వాయు కాలుష్యం పెరుగుతుందని పోలీసులు అనుమతి నిరాకరించినట్లు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఇటీవల ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలు జరుపుకోవడానికి పోలీసులు అనుమతించినప్పుడు, ఈ సమస్య కనబడలేదా? అని అయన ప్రశ్నిస్తున్నారు. 

దీనిని అభద్రతాభావమనుకోవచ్చు లేదా రాజకీయకక్ష సాధింపు అనుకోవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ, ప్రొఫెసర్ కోదండరాం మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం ఖాయం. కోర్టు అనుమతితో బహిరంగ సభ నిర్వహించుకోవడం కూడా ఖాయమే. ఈ సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పుడు సభను అడ్డుకొని విమర్శలపాలవడం తప్ప ఏమి సాధించినట్లు?

టిజెఎస్ లో ప్రొఫెసర్ కోదండరాం, మరో ఒకరిద్దరు నేతలు తప్ప రాష్ట్ర ప్రజలందరికీ పరిచయమున్న మొహాలే లేవు. అటువంటి పార్టీని చూసి తెరాస భయపడుతున్నట్లయితే, మరి రాజకీయాలలో కొమ్ములు తిరిగిన డజన్ల కొద్దీ నేతలున్న కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ఎదుర్కోగలదు?

ఏది ఏమైనప్పటికీ తెలంగాణా సాధన కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరాంను ఉద్దేశ్యించి ఎంత చులకనగా మాట్లాడితే అంతగా తమ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందనే సంగతి మరిచిపోకూడదు.


Related Post