సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని తిరుమలగిరికి చెందిన సైదులు అనే ఒక రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న భద్రతాసిబ్బంది వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం అతనికి రాయితీపై ట్రాక్టర్ ను ఇచ్చింది. ఫైనాన్స్ వాళ్ళకి అతను బాకీపడినందున వాళ్ళు వచ్చి ఆ ట్రాక్టర్ ను పట్టుకుపోయారు. వారిని ఎంతగా బ్రతిమలాడినప్పటికీ వారు కనికరించలేదు. దీని గురించి స్థానిక అధికారులకు పిర్యాదు చేసినా వారూ స్పందించకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోని హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంప్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సైదులుకు ఎదురైన ఈ అనుభవం బహుశః రాష్ట్రంలో అనేకమంది రైతులకు ఎదురయ్యే ఉండవచ్చు. రాష్ట్రంలో వివిధవర్గాల ప్రజలకు ప్రభుత్వం రకరకాల పధకాల ద్వారా సహాయపడుతోంది. ట్రాక్టర్లు, గొర్రెలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఎకరానికి రూ. 4,000 పంట పెట్టుబడి, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు వగైరా అందిస్తోంది. ప్రభుత్వం ఒక గొప్ప ఆశయంతో మంచి ఉద్దేశ్యంతో పేదలకు అందిస్తున్న ఇవన్నీ నిజంగా అర్హులకు అందుతున్నాయా..లేదా? వాటిని వారే అనుభవిస్తున్నారా లేక ఈవిధంగా వేరేవారి చేతిలోకైనా వెళ్ళిపోతున్నాయా? అని తెలుసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ట్రాక్టర్లు, గొర్రెల పంపిణీలో మరింత నిఘా అవసరం ఉందని సైదులు వ్యవహారం స్పష్టం చేస్తోంది.