యూపి, బిహార్ ఎన్నికల ప్రచార సమయంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తదితరులు ‘ఆ రెండు రాష్ట్రాలలో ఆటవిక రాజ్యం నెలకొని ఉందని, భాజపాకు ఓటువేసి గెలిపిస్తే అలనాటి రామరాజ్యాన్ని తలపించేవిధంగా రెండు రాష్ట్రాలలో సుస్థిర ప్రభుత్వాలు, శాంతిభద్రతలు నెలకొల్పి దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడేవిధంగా యూపి, బిహార్ రాష్ట్రాలను అభివృద్ధి చేసి చూపిస్తామని’ హామీ ఇచ్చారు. కానీ యూపిలో భాజపా గెలిచి యోగి సర్కార్ అధికారం చేపట్టిన తరువాత వందల కొద్ది శిశుమరణాలు, గోసంరక్షణ పేరిట దళితులు, మైనార్టీ వర్గాల ప్రజలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి.
గత ఏడాది జూన్ 4వ తేదీన యూపిలో అధికార భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ అతని సోదరుడు 18 ఏళ్ళు వయసున్న బాలికను ఎత్తుకొనిపోయి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె పిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. అందుకు ఆగ్రహించిన ఎమ్మెల్యేకు చెందిన గూండాలు ఆమె ఇంటిపై దాడి చేసి ఆమెను, ఆమె తండ్రిని చితకబాదారు. ఆమె మళ్ళీ పోలీసులను ఆశ్రయించగా వారు ఆమె తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో వేసి చిత్రహింసలకు గురిచేయడంతో అయన లాకప్ లో మృతి చెందాడు. ఇక తనకు న్యాయం జరగదనే నిస్పృహతో ఆమె సిఎం ఆదిత్యనాద్ యోగి ఇంటి ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఈ సంఘటనపై హడావుడి చేయడంతో యోగి సర్కార్ మేల్కొని ఇద్దరు పోలీసు అధికారులను, నలుగురు పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంది.
ఇటీవల డాక్టర్ అంబేద్కర్ పేరును డాక్టర్ రాంజీ అంబేద్కర్ గా మారుస్తూ యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు బదౌన్ జిల్లాలో ఒక గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఎవరో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ద్వంసం చేస్తే, దాని స్థానంలో కాషాయరంగు సూట్ తో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయించడం మరో వివాదం మొదలయింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పట్ల ఈవిధంగా అనుచితంగా వ్యవహరించడం పట్ల ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. మోడీ, అమిత్ షాలు చెప్పిన ఆ రామ రాజ్యం ఇదేనా ? అని ప్రశ్నిస్తున్నారు. యూపిలో జరుగుతున్న ఈ సంఘటనలు, యోగి ప్రభుత్వ వైఫల్యాల ప్రభావం యూపికే పరిమితం అవుతాయనుకొంటే పొరపాటే. త్వరలో జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై, సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు.
ప్రజలు ఒక పార్టీపై నమ్మకంతో దానికి అధికారం కట్టబెట్టినప్పుడు అది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కానీ అధికారంలోకి రాగానే అధికారమధంతో ఈవిధంగా తమకు ఎదురేలేదన్నట్లు నేతలు వ్యవహరిస్తే మళ్ళీ అదే ప్రజలు తగినవిధంగా బుద్ధి చెపుతారని అనేకసార్లు రుజువు చేశారు. ఇది యోగి సర్కార్ తో అధికార పార్టీలన్నిటికీ వర్తిస్తుంది.