తెలంగాణా జన సమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ఏజంట్ అని తెరాస విమర్శిస్తుంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ అయన కెసిఆర్ ఏజంటని ఆక్షేపించడం విశేషం. ఇవ్వాళ్ళ గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ప్రొఫెసర్ కోదండరాం కెసిఆర్ పెరట్లో మొక్కవంటివారు. వచ్చే ఎన్నికలలో అయన తెరాస వ్యతిరేక ఓట్లను చీల్చి దానికి లబ్ది చేకూర్చడం కోసమే టిజెఎస్ తో బరిలో దిగుతున్నారు. ఒకవేళ అయన నిజంగా కెసిఆర్ సర్కార్ ను ఓడించాలనుకొంటే, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలి. అప్పుడే అయన చెపుతున్న మాటలకు విశ్వసనీయత ఏర్పడుతుంది,” అని అన్నారు.
డికె అరుణ చేసిన ఆరోపణ చాలా విచిత్రంగా ఉంది. గత మూడున్నరేళ్ళుగా కోదండరాం కాంగ్రెస్ నేతలతో కలిసి తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అందుకే తెరాస నేతలు అయనపై ‘కాంగ్రెస్ ఏజంట్’ అనే ముద్రవేశారు. అయన స్వంత పార్టీ పెట్టుకొని రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకొనే బరిలో దిగుతున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టిజెఎస్ బరిలోకి దిగడం వలన తెరాస వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని భయపడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆయన తమ పార్టీతో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవాలని ఆశించడం సహజం. అదే కనుక చేస్తే అప్పుడు తెరాస నేతలు ఇంతకాలంగా చేస్తున్న ఆరోపణలు నిజమని దృవీకరించినట్లవుతుంది. కనుక అయన కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోకపోవచ్చు. అందుకే కాంగ్రెస్ నేతలు కూడా ఆయనపై విమర్శలు మొదలుపెట్టినట్లున్నారు. అయితే కాంగ్రెస్, ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరి లక్ష్యం తెరాసను ఓడించడమే కనుక లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొని పోటీ చేసినా ఆశ్చర్యం లేదు.