రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న కేటిఆర్ తన సమర్ధతను నిరూపించుకొన్నారు. అలాగే అన్ని జిల్లాలలో పర్యటిస్తూ అటు ప్రజలతో, ఇటు తెరాస నేతలందరితో సత్సంబంధాలు ఏర్పరచుకొన్నారు. రాజకీయాలలో తనకంటే చాలా సీనియర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారిని సైతం ధీటుగా ఎదుర్కొంటూ రాజకీయాలలో కూడా తన సత్తా నిరూపించుకొంటున్నారు. కేంద్రమంత్రులు, డిల్లీలోని అనేకమంది ఉన్నతాధికారులు సైతం అయన తీరును ప్రశంసిస్తున్నారు.
కనుక కేటిఆర్ కు పదోన్నతి కల్పించవలసిన సమయం ఆసన్నమైందని చాలామంది భావిస్తున్నారు. ఈ నెల 27న జరుగబోయే తెరాస ప్లీనరీ సమావేశంలో కేటిఆర్ కు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి గత ఏడాదే ఆయనకు ఆ పదవి కట్టబెట్టి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అందరూ అనుకొన్నప్పటికీ, ఆవిధంగా చేస్తే ఊహించని సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో ఆ ఆలోచన విరమించుకొన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఆయన డిల్లీ వెళ్ళిపోతే పార్టీకి కేటిఆరే నాయకత్వం వహిస్తారనే సంగతి అందరికీ తెలిసి ఉన్నప్పటికీ, దానిపై స్పష్టతనీయవలసిన అవసరం ఉంది. కనుక పార్టీ శ్రేణులలో నెలకొన్న ఆ అయోమయాన్ని తొలగించేందుకు ప్లీనరీ సమావేశంలో కేటిఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తద్వారా పార్టీ శ్రేణులకు, రాజకీయ ప్రత్యర్ధులకు, రాష్ట్ర ప్రజలకు కేటిఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని స్పష్టం చేసినట్లవుతుంది. ఎన్నికలకు ఇంకా 9-12 నెలల సమయం ఉంది కనుక ఈలోగా కేటిఆర్ తో సహా అందరూ ఈ మార్పుకు మానసికంగా సిద్దపడగలరు కూడా. ఒకవేళ ఎన్నికలలోగా ఏదైనా ఊహించని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించడానికి కెసిఆర్ ఉండనే ఉన్నారు.