ప్రజారోగ్యం విషయంలో గత ప్రభుత్వాలు చాలా అలసత్వం చూపేవి. వాటిలో ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఒక్క రూపాయికి కిలో బియ్యం వంటి కొన్ని పధకాలు తప్ప చాలావరకు మొక్కుబడిగా లేదా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టినవే ఉండేవి. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పధకాలు కూడా ఎన్నికలలో తెరాసకు రాజకీయలబ్ది కలిగించడం కోసమేనని ముఖ్యమంత్రి కెసిఆర్ కుండబద్దలు కొట్టినట్లు శాసనసభలో చెప్పినప్పటికీ, వాటి అమలులో అయన చూపుతున్న నిజాయితీ, చిత్తశుద్ధి కారణంగా అవి అర్హులైన ప్రజలకు చాలా మేలు కలిగిస్తున్నాయి.
తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వనరులను, ప్రజల అవసరాలను లోతుగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగానే పనులను, పధకాలను రూపొందించుకొని, వాటిని అంతే చిత్తశుద్ధితో పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, ప్రజారోగ్యం, విద్యారంగాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పనులు, పధకాలు విజయవంతంగా సాగుతున్నాయి. వాటిలో కూడా వివిధ కారణాల చేత ఒకటీ అరా విఫలం అయ్యుండవచ్చు కానీ అధికశాతం విజయవంతంగా సాగుతున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వం కూడా వాటిని ఆదర్శంగా తీసుకొంటున్నాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా మరో రెండు సంక్షేమ పధకాలను అమలుచేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. 1. రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స, మందులు, కళ్ళజోళ్ళు అందించడం. 2. రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలతో కూడిన డాటా బేస్ తయారు చేయడం.
కంటి పరీక్షల కోసం అవసరమైన ఏర్పాట్లు మొదలయ్యాయి. సుమారు 900 వైద్య బృందాలు, అవసరమైతే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు వైద్య బృందాలను కూడా రప్పించి రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. ముందుగా దీనికి తగిన ప్రణాళిక రూపొందించుకోవలసిందిగా సూచించారు. ప్రజలకు కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, మందులు, కళ్ళజోళ్ళు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అలాగే విస్తృతమైన ఈ కార్యక్రమలో పాల్గొనే వైద్య బృందాలకు ఆహారం, వసతి, రవాణా తదితర సౌకర్యాలన్నిటినీ ప్రభుత్వమే కల్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.
ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత రెండవది చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చూపిస్తున్న ప్రత్యేకశ్రద్ధ రాష్ట్ర ప్రజల పట్ల అయన అంకితభావానికి, చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.